Begin typing your search above and press return to search.

ఎంతటి బరి తెగింపు రా నాయనా? సీఎం చంద్రబాబు స్థలానికే ఎసరు పెట్టేశారా?

బాపట్లలో సీఎం చంద్రబాబు పేరిట ఉన్న స్థలానికే ఎసరు పెట్టాలని చూసిన కబ్జాదారులు చివరికి కటకటాల పాలయ్యారు.

By:  Tupaki Desk   |   3 Feb 2025 9:30 AM GMT
ఎంతటి బరి తెగింపు రా నాయనా? సీఎం చంద్రబాబు స్థలానికే ఎసరు పెట్టేశారా?
X

ఏపీలో భూ మాఫియా రెచ్చిపోతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసేయడమే పనిగా పెట్టుకుంది. తమ భూ దాహానికి ఎంతటికైనా తెగిస్తోంది. దాడులు, హత్యలు ఇలా ఒకటేంటి భూ మాఫియా అరాచకాలు గత కొన్నేళ్లుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా అన్నింటికి మించి అన్నట్లు ఏకంగా సీఎం చంద్రబాబు పేరిట ఉన్న భూమినే కబ్జా చేయాలని చూశారు. పదేళ్లుగా చంద్రబాబు పేరిట ఉన్న భూమిపై నకిలీ రిజిస్ట్రేషన్లు చేసి లింకు డాక్యుమెంట్లు సృష్టించారు. చివరికి బ్యాంకులో రుణం తీసుకోవాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. బాపట్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఉందంతం రాష్ట్రంలో సంచలనంగా మారింది.

భూమి ధరలు పెరిగిపోవడంతో భూములకు రక్షణ లేకపోయిందనేది మరోసారి తేటతెల్లమైంది. బాపట్లలో సీఎం చంద్రబాబు పేరిట ఉన్న స్థలానికే ఎసరు పెట్టాలని చూసిన కబ్జాదారులు చివరికి కటకటాల పాలయ్యారు. టీడీపీపై అభిమానంతో బాపట్లకు చెందిన మువ్వా భాస్కరరావు పాతికేళ్ల క్రితం 9.5 సెంట్ల స్థలాన్ని పార్టీ కార్యాలయం నిర్మాణానికి విరాళంగా ఇచ్చాడు. కానీ, ఆయన ఆశ నెరవేరలేదు. బాపట్ల శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఈ స్థలం విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో దాదాపు రూ. 1.5 కోట్లు విలువ ఉంటుంది. అంతటి విలువైన స్థలాన్ని ఖాళీగా వదిలేయడంతో కబ్జాదారుల కన్ను పడింది.

అడిగేవారు లేరనుకుని 2010 నుంచి ఆ స్థలంపై నకిలీ రిజిస్ట్రేషన్లు చేయించారు. ఇలా పదిహేన్నుళ్లుగా రకరకాల పేర్లు మార్చి లింకు డాక్యుమెంట్లు తయారు చేశారు. ఆ పత్రాల ద్వారా బ్యాంకులో రుణం తీసుకుంటే తమ నకిలీ బాగోతానికి చట్టబద్ధత వస్తుందని భావించి రుణ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే బ్యాంకు అధికారులు విచారణలో స్థలం సీఎం చంద్రబాబు పేరిట ఉందన్న విషయం వెలుగుచూసింది. దీంతో వారు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మకు సమాచారం ఇచ్చారు.

బాంకర్ల సమాచారంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కబ్జాదారుల ఆట కట్టింది. రుణం కోసం బ్యాంకును సంప్రదించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో కూడా ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో నిందితుడు తోపాటు మరికొందరి భాగస్వామ్యం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

సీఎం చంద్రబాబు పేరిట ఉన్న స్థలాన్నే కొట్టేయాలని ప్లాన్ చేశారంటే రాష్ట్రంలో భూ మాఫియా ఎంతకు తెగించిందో ఊహించవచ్చు. పేదల స్థలాల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామని రెండు నెలల క్రితమే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. భూ ఆక్రమణల నిరోధక చట్టం ద్వారా కబ్జాదారులకు పదేళ్ల శిక్ష పడేలా చేస్తామని వెల్లడించింది. అయితే ఈ చట్టం కింద ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బాధితుడు కావడం గమనార్హం.