బర్రెలక్క సెక్యూరిటీ పిటిషన్... తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు!
ఈనెల 30న జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో బర్రెల్లక్క అనే ప్రముఖ యూట్యూబర్ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Nov 2023 11:54 AM GMTఈనెల 30న జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో బర్రెల్లక్క అనే ప్రముఖ యూట్యూబర్ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈమె ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారారు. ఈ సమయంలో తనకు సెక్యూరిటీ కల్పించాలని.. అది కూడా 2 ప్లస్ 2 కావాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.
అవును... ప్రముఖ యూట్యూబర్ బర్రెలక్క సెక్యూరిటీ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఇందులో భాగంగా ఆమెకు తగిన భద్రత కల్పించాలని డీజీపీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆమె పబ్లిక్ మీటింగులకు కూడా ఎన్నికల కమిషన్, రాష్ట్ర డీజీపీ భద్రత కల్పించాలని హైకోర్టు తెలిపింది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆమె పూర్తి భద్రత ఎన్నికల కమిషన్, రాష్ట్ర డీజీపీదే అని తెలిపింది.
కాగా... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం విసృతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆమె తన సోదరుడితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో ఆమె సోదరుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దాడి ఘటనను మాజీ సీబీఐ డైరెక్టర్ జేడీ లక్ష్మినారాయణ సహా పలువురు ఖండించారు. దీంతో తనకు భద్రత కల్పించాలని ఎన్నికల సంఘం అధికారులకు, డీజీపీకి ఆదేశాలు జారీచేయాలని బర్రెలక్క హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమె పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఆమెకు తగిన సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా స్పందించిన ఉన్నత న్యాయస్థానం... కేవలం గుర్తింపు ఉన్న పార్టీల అభ్యర్థులకే కాకుండా సాధారణ అభ్యర్థులకు కూడా భద్రత కల్పించాలని వ్యాఖ్యానించిందని తెలుస్తుంది. ఎన్నికల బరిలో నిలిచిన వారికి ముప్పు ఉందని భావిస్తే వారికి కూడా ఈ సందర్హంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించింది. దీంతో.. ఇది బర్రెలక్కకు మరో విజయం అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు!