అతిచిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన యాంకర్!
ఇటీవల ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 7 Dec 2023 4:48 AM GMTఇటీవల ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. వాటిలో నాలుగు (మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణా) రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించగా.. మిజోరాం అసెంబ్లీ ఫలితాలు మాత్రం డిసెంబర్ 4న ప్రకటించారు. ఆ ఫలితాల్లో బారిల్ వన్నెహ్సాంగి అనే మహిళ ప్రధాన ఆకర్షణగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఇప్పుడు ఆమెగురించిన చర్చ ఆన్ లైన్ వేధికగా బలంగా సాగుతుంది.
అవును... రాజకీయాల్లో అప్పుడప్పుడూ ఎవ్వరూ ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వాటిలో తాజా సంచలనం బేరిల్ వన్నెహసాంగి అనే మహిళా ఎమ్మెల్యే ఒకరు. టీవీ యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించిన బేరిల్.. అంచలంచెలుగా ఎదుగుతూ తాజాగా జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో మిజోరాం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో.... ఆమె ఎవరు? అనే చర్చ మొదలైంది.
మిజోరాం ఎన్నికల్లో జోరాం పీపుల్స్ మూవ్ మెంట్ పార్టీ తరఫున ఐజ్వాల్ సౌత్-3 స్థానం నుంచి పోటీ చేసిన బేరిల్.. తన ప్రత్యర్థి అయిన మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి ఎఫ్ లాల్నున్మావియాపై ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థికి 7,956 ఓట్లు పోలవగా.. ఈమెకు 9,370 ఓట్లు లభించాయి. దీంతో ఆమె 1,414 ఓట్ల మెజారితో గెలుపొందారు. దీంతో.. అతి పిన్న చిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించింది.
బేరిల్.. మిజోరాంలో 1991లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 32 సంవత్సరాలు. మేఘాలయలోని షిల్లాంగ్ లో నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేసిన ఆమె... ఒక యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. క్రమంగా పాపులారిటీ గడించి.. రాజకీయాలపై ఆసక్తితో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె గతంలో ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కౌన్సిలర్ గా కూడా పని చేసింది.
ఇన్ స్టాగ్రాం లోనూ ఆమెకు 2 లక్షల 51 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. లింగ సమానత్వం కోసం ఆమె ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలో తనదైన ముద్ర వేసి.. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు.
కాగా... మిజోరాంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లోనూ జెడ్.పీ.ఎం. 27, ఎం.ఎన్.ఎఫ్. 10 సీట్లు, బీజేపీ 2 సీట్లు, కాంగ్రెస్ ఒక స్థానంలోనూ గెలుపొందాయి. ఇందులో భాగంగా... జెడ్.పీ.ఎం కు 37.86 శాతం, ఎం.ఎన్.ఎఫ్. కు 35.10 శాతం, బీజేపీకి 5.06 శాతం, కాంగ్రెస్ కు 2.82 శాతం ఓట్లు వచ్చాయి.