Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిలో బ‌స‌వ తార‌కం ఆసుప‌త్రి.. ఈ నెల‌లోనే శంకుస్థాప‌న‌!

ప్ర‌స్తుతం ఈ ఆసుప‌త్రి నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను చైర్మ‌న్ హోదాలో టీడీపీ నాయ‌కుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ చూస్తు న్నారు.

By:  Tupaki Desk   |   25 Nov 2024 3:44 AM GMT
అమ‌రావ‌తిలో బ‌స‌వ తార‌కం ఆసుప‌త్రి.. ఈ నెల‌లోనే శంకుస్థాప‌న‌!
X

ఏటా వేలాది మంది కేన్స‌ర్ రోగుల‌కు చికిత్స‌లు అందిస్తూ.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి పొందిన బ‌స‌వ తార‌కం ఇండో-అమెరిక‌న్ కేన్స‌ర్ ఆసుప‌త్రి గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. ప్ర‌పంచ స్థాయి ఆధునిక వైద్యంతో ఇక్క‌డ కేన్స‌ర్ చికిత్స‌కు సేవలందిస్తున్నారు. ప్ర‌స్తుతం బ‌స‌వ తార‌కం ఇండో అమెరిక‌న్ కేన్స‌ర్ ఆసుప‌త్రి.. హైద‌రాబాద్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. దివంగ‌త ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ తార‌కం.. కేన్స‌ర్ కార‌ణంగా చ‌నిపోయిన నేప‌థ్యంలో ఆమె స్మృత్య‌ర్థం.. అప్ప‌ట్లోనే అన్న‌గారు .. ఈ ఆసుప‌త్రికి శ్రీకారం చుట్టారు. అత్యంత త‌క్కువ ఖ‌ర్చుల‌తో దీనిని నిర్వ‌హిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ ఆసుప‌త్రి నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను చైర్మ‌న్ హోదాలో టీడీపీ నాయ‌కుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ చూస్తు న్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు అధునాత‌న వైద్యాన్ని చేరువ చేస్తూ.. ప్ర‌యోగాల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తూ.. కేన్స‌ర్ బారిన ప‌డిన ప్ర‌జ‌ల కు ఉప‌శ‌మ‌నం క‌ల్పిస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా బ‌స‌వ తార‌కం ఇండో-అమెరిక‌న్ ఆసుప‌త్రికి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఏపీ ప్ర‌జ‌ల కోసం ప్ర‌త్యేకంగా దీనిని ఏపీలోనూ ఏర్పాటు చేయాల‌ని త‌ల‌పోశారు. దీంతో న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో దీనికి అప్ప‌టి(గ‌త టీడీపీ ప్ర‌భుత్వం) సీఎం చంద్ర‌బాబు భూమిని కేటాయించారు.

సుమారు 15 ఎక‌రాల‌కు పైగానే బ‌స‌వ‌తారకం ఆసుప‌త్రికి భూమి ఇచ్చారు. దీనిని 99 సంవ‌త్స‌రాల పాటు లీజుకు కేటాయించా రు. అయితే.. వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ప‌నులు చేప‌ట్ట‌లేదు. అప్ప‌ట్లో రాజ‌ధాని అమ‌రావ‌తిని అట‌కెక్కించి.. మూడు రాజ‌ధానుల‌ను భాజాన మోసిన విష‌యం తెలిసిందే. దీంతో రాజ‌ధానిలో ఏర్పాటు చేసే.. ప్రైవేటు నిర్మాణాలు, సంస్థ‌లు అన్నీ మ‌రుగున ప‌డ్డాయి. అయితే.. తాజాగా కూట‌మి స‌ర్కారు రావ‌డం.. రాజ‌ధానిని తిరిగి ప‌ట్టాలెక్కించ‌డం, పెట్టుబ‌డి దారుల‌ను తిరిగి ఆహ్వానించ‌డంతో రాజ‌ధానిలో అప్ప‌ట్లో భూములు తీసుకున్న బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ ఆసుప‌త్రి కూడా రంగంలోకి దిగింది.

తాజాగా బాల‌కృష్ణ‌.. ఆదివారం అమ‌రావ‌తిలో ఏపీ సీఆర్ డీఏ అధికారుల‌తో భేటీ అయ్యారు. త‌న‌కు కేటాయించిన 15 ఎక‌రాల భూమిని ఆయ‌న స్వ‌యంగా ఆసుప‌త్రి వ‌ర్గాల‌తో క‌లిసి వెళ్లి ప‌రిశీలించారు. ప్ర‌స్తుతం కార్తీక మాసం న‌డుస్తుండ‌డంతో ఈ నెల‌లోనే దీనికి శంకు స్థాప‌న చేసి ఆసుప‌త్రి నిర్మాణాన్ని ప్రారంభించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలిపారు. కాగా, నిన్న మొన్న‌టి వ‌ర‌కు పిచ్చి చెట్ల‌తో అట‌వీ ప్రాంతాన్ని త‌ల‌పించిన ఈ స్థ‌లాన్ని ఇటీవ‌లే 40 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి క్లియ‌ర్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బ‌స‌వ తార‌కం ఇండో అమెరిక‌న్ ఆసుప‌త్రి నిర్మాణానికి బాల‌య్య వ‌డివ‌డిగా అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇదే జ‌రిగితే.. అమ‌రావ‌తిలో తొలి ప్రైవేటు నిర్మాణం ఇదే అవుతుంది.