Begin typing your search above and press return to search.

అధ్యక్షుడు కాదు.. 'మిషినరీ ఆఫ్‌ డెత్'.. సామూహిక సమాధులే సాక్షి

ఇక ఇప్పుడు వినిపిస్తున్నదాని ప్రకారం సిరియా నుంచి పారిపోయిన మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ నూ క్రూర పాలకుల జాబితాలో చేర్చాల్సిందే.

By:  Tupaki Desk   |   18 Dec 2024 12:30 PM GMT
అధ్యక్షుడు కాదు.. మిషినరీ ఆఫ్‌ డెత్.. సామూహిక సమాధులే సాక్షి
X

జర్మనీలో ఒకప్పటి హిట్లర్.. ఆ తర్వాత ఉగాండాలో ఈడీ అమిన్.. చరిత్రలో అత్యంత భయంకర నియంతలుగా పేరుగాంచారు. వారి లక్ష్యం కోసం.. ప్రజల అంతు చూసేవరకు వదలని క్రూరులుగా పేరొందారు. హిట్లర్ లక్షలాది యూదులను అత్యంత పాశవికంగా చంపించాడు. ఈడీ అమిన్ కు నరమాంస భక్షకుడనే పేరుంది. అయితే, ఇటీవలి కాలంలో ఇలాంటి పాలకులు లేరు అనుకోవాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ పై విమర్శలు, ఆరోపణలు ఉన్నా.. ఆయన చేస్తున్నదంతా దేశ ప్రయోజనాల రీత్యానే అనే అభిప్రాయం ఉంది. ఇక ఇప్పుడు వినిపిస్తున్నదాని ప్రకారం సిరియా నుంచి పారిపోయిన మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ నూ క్రూర పాలకుల జాబితాలో చేర్చాల్సిందే.

55 ఏళ్లుగా..

పశ్చిమాసియాలో అందమైన దేశంగా పేరున్న సిరియాను 1971 నుంచి బషర్ కుటుంబమే పాలించింది. 2000 సంవత్సరం నుంచి బషర్‌ అల్‌ అసద్‌ అధికారంలో ఉన్నారు. రెండువారాల కిందట తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్ వరకు రావడంతో ఆయన దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు అసద్ పాలనతో జరిగిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తండ్రి 30 ఏళ్లు, కుమారుడు 25 ఏళ్లు సిరియాను గుప్పిట పట్టడంతో ఇంతకాలం వెలుగుచూడని దారుణాలు ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి.

డమాస్కస్ జైలు.. భూమ్మీద నరకం

అసద్ కు ఎదురుతిరిగిన వారిని సిరియా రాజధాని డమాస్కస్ జైల్లో బంధించి చిత్రహింసలు పెట్టినట్లుగా కథనాలు వచ్చాయి. ఆ జైలను ఈ భూమ్మీద నరకంగా అభివర్ణించారు. ఇక అసద్‌ పాలనపై 2011లో అరబ్ విప్లవం అనంతరం తిరుగుబాటు మొదలైంది. దీంతో ఆయన 2013 నుంచి అణచివేత మొదలుపెట్టారు. అలా లక్ష మంది ప్రజలను వేధించి, హత్య చేసినట్లు తెలుస్తోంది.

‘మిషినరీ ఆఫ్‌ డెత్’

వ్యతిరేకులను అంతం చేయడానికి అసద్ పెట్టిన మిషన్ పేరు ‘మిషినరీ ఆఫ్‌ డెత్’. ఇలాంటి ఘోరాల్లో 2013 నుంచి లక్ష మంది పైగా కనిపించకుండా పోయారట. వీరిని చనిపోయేవరకు చిత్రవధ చేశారట. డమాస్కస్‌ ఉత్తరాన 40 కి.మీ. దూరంలో ఉన్న కుతైఫా, డమాస్కస్‌ దగ్గర్లోని నఝాలో ఉన్న సమాధులను పరిశీలించడానికి వెళ్లిన అమెరికన్ ప్రతినిధులు అక్కడి పరిస్థితులను చూసి నివ్వెరపోయారట. జర్మనీలో నాజీల హయాంలోనూ ఇలాంటివి ఎన్నడూ చూడలేదని యుద్ధ నేరాల మాజీ రాయబారి స్టీఫెన్‌ రాప్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

పాలకుడిని వ్యతిరేకించేవారిని రహస్య పోలీసులు డమాస్కస్‌ శివార్లలోని ప్రత్యేక చోటుకు తీసుకెళ్లి ఆహారం లేకుండా హింసించి.. చనిపోయేలా చేసేవారని స్టీఫెన్ పేర్కొన్నారు. చివరకు మృతదేహాలను కంటైనర్లు, ట్రక్కుల్లో తరలించి సామూహికంగా పూడ్చిపెట్టేవారని తెలిపారు. ఈ వ్యవస్థలో వేలాది మంది ప్రజలు పనిచేసేవారని.. ప్రభుత్వ వ్యతిరేకులను హత్య చేయడానికి రసాయన ఆయుధాలను సైతం వాడేవారని అమెరికా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

కుటేఫాలో లక్ష మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు గుర్తించారు. మరో 66 సామూహిక సమాధులు ఉన్న ప్రదేశాలను గుర్తించామన్నారు.