Begin typing your search above and press return to search.

అస్మదీయుడు అసద్.. అత్యంత సురక్షితంగా మా దేశానికే.. రష్యా

సిరియా అధ్యక్ష పీఠాన్ని 25 ఏళ్లుగా అంటిపెట్టుకుని కూర్చున్న బషర్ అల్ అసద్ ఎట్టకేలకు దిగిపోయారు.

By:  Tupaki Desk   |   11 Dec 2024 1:30 PM GMT
అస్మదీయుడు అసద్.. అత్యంత సురక్షితంగా మా దేశానికే.. రష్యా
X

అంతా 10 రోజుల్లోనే జరిగిపోయింది.. పదమూడేళ్లు కిందటే ఉద్యమం మొదలైనా ఇన్నాళ్లూ తొక్కిపెట్టిన నాయకుడు తోక ముడిచాడు.. సిరియా అధ్యక్ష పీఠాన్ని 25 ఏళ్లుగా అంటిపెట్టుకుని కూర్చున్న బషర్ అల్ అసద్ ఎట్టకేలకు దిగిపోయారు. అయితే, మరి ఆయన ఎక్కడకు వెళ్లారు..? అసలు జీవించి ఉన్నారా? విమానంలో పరారవుతుండగా ఒక్కసారిగా కిందకు ఎందుకు పడిపోయింది..? రాడార్ నిఘా నుంచి తప్పించుకునేందుకా? లేక కుప్పకూలిందా..? కుటుంబంతో సహా అసద్ పారిపోతున్నది ఎక్కడికి? ఇలా అనేక ప్రశ్నలు.. మూడు రోజులుగా ప్రజలను వేధిస్తున్నాయి. అయితే వీటికి సమాధానం దొరికింది.

చేరాల్సిన చోటకే చేరాడు..

అసద్ బ్రిటన్ లో చదివాడు.. 2000లో తిరిగొచ్చి తండ్రి స్థానంలో సిరియాకు అధ్యక్షుడు అయ్యాడు. అయితే, 2011లో దేశంలో అంతర్యుద్ధం నుంచి అతడిని కాపాడింది రష్యా, ఇరాన్. మరీ ముఖ్యంగా రష్యా గనుక తోడు రాకుంటే అమెరికా మద్దతున్న మిలిటెంట్ గ్రూప్ లు అసద్ ను అప్పుడే కూలదోసేవి. అప్పటినుంచి కూడా సిరియాలో నౌకా, వైమానిక స్థావరాలు కొనసాగిస్తోంది రష్యా. కాగా, ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యా తన ఫోకస్ తగ్గించడం అసద్ కొంపముంచింది. మరోవైపు ఇజ్రాయెల్ తో కయ్యానికి కాలు దువ్విన ఇరాన్ కూడా సిరియాను నిర్లక్ష్యం చేసింది.

అదను చూసి దాడులు..

రష్యా, ఇరాన్ మద్దతు తగ్గడంతో సిరియాలోని సాయుధ తిరుగుబాటుదారులు అవకాశంగా తీసుకున్నారు. రాజధాని డమాస్కస్‌ తో సహా పలు నగరాలను ఆక్రమించుకున్నారు. ఆ వెంటనే అసద్‌ తన కుటుంబంతో పారిపోయారు. అయితే, ఆయన ఎక్కడకు వెళ్లారో తెలియరాలేదు. చివరకు రష్యాకు శరణార్థిగా చేరినట్లు తెలుస్తోంది. అసద్ ప్రస్తుతం మాస్కోలో ఉన్నారు.

తాను దిగిపోయేందుకు, అధికారాన్ని బదిలీ చేసేందుకు తిరుగుబాటుదారులతో అసద్ చర్చలు జరిపారట. ఆ తర్వాతే దేశాన్ని వీడారని రష్యా తెలిపింది. ఇలా తమ చిరకాల మిత్ర దేశాన్ని చేరిన అసద్ ఇక అక్కడే శేష జీవితం గడపాల్సి రావొచ్చు. మరోవైపు సిరియాలో రెబల్స్‌ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.