Begin typing your search above and press return to search.

కళ్లు తిరిగి బాత్రూంలో పడుతున్నోళ్ల లెక్క తెలుసా? జర జాగ్రత్త!

పెద్ద వయస్కులకు సంబంధించి తరచూ వినే ఒక మాట.. ఫలానా వారింట్లో ఫలానా వారు బాత్రూంలో జారి పడ్డారని. బాత్రూంలో జారిపడటంతో మరిన్ని ఆరోగ్య సమస్యలే కాదు.. వారి జీవితం గతానికి భిన్నంగా మారుతుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.

By:  Tupaki Desk   |   12 Dec 2024 5:30 AM GMT
కళ్లు తిరిగి బాత్రూంలో పడుతున్నోళ్ల లెక్క తెలుసా? జర జాగ్రత్త!
X

పెద్ద వయస్కులకు సంబంధించి తరచూ వినే ఒక మాట.. ఫలానా వారింట్లో ఫలానా వారు బాత్రూంలో జారి పడ్డారని. బాత్రూంలో జారిపడటంతో మరిన్ని ఆరోగ్య సమస్యలే కాదు.. వారి జీవితం గతానికి భిన్నంగా మారుతుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఇంట్లో పెద్ద వయస్కులు ఉన్న వారంతా ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. అప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే పెద్ద వయస్కులు పలువురు బాత్రూంకు వెళ్లినప్పుడు జారి పడటం.. ఈ సందర్భంగా తుంటి ఎముక నుంచి పలు సమస్యలు ఎదురవుతుంటాయి. మునుపటి మాదిరి తమ పనులు తాము చేసుకోలేక తీవ్ర అవస్థలకు గురవుతుంటారు.

ఇంతకూ పెద్ద వయస్కులు బాత్రూంలో ఎందుకు తూలి పడుతుంటారు? అనేది ప్రధాన ప్రశ్న. దీనికి కారణం ఏమిటి? అనే అంశంపై ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు ఒక అధ్యయనాన్ని చేపట్టారు. ఇందులో బాగంగా 65 ఏళ్లు దాటిన 1,03,000 మందిని శాంపిల్ గా తీసుకున్నారు. వీరిపై 29 వేర్వేరు పరిశోధనలు జరిపారు. బాత్రూంలో సడన్ గా పడిపోవటం వెనుకు ఉన్నట్లుండి కళ్లు బైర్లు కమ్మి పడిపోవటం ప్రధాన కారణంగా తేల్చారు.

65 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురిలో ఒకరు ఏడాదిలో కనీసం ఒక్కసారైనా పడిపోతున్న కొత్త విషయాన్ని గుర్తించారు. ఇలా కింద పడిన వారిలో 10 శాతం మంది తీవ్ర గాయాల పాలవుతున్నట్లుగా తేల్చారు. హటాత్తుగా కళ్లు బైర్లు కమ్మే సమస్య రానున్న రోజుల్లో మరింత ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. ఈ సమస్య ఎదురుకాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని వైద్యులు వివరిస్తున్నారు.

ఇంతకు హటాత్తుగా కళ్లు బైర్లు కమ్మటం.. శరీరం బ్యాలెన్సు మిస్ కావటం.. తల భారంగా అనిపించటం వెనుకున్న అసలు కారణాలు ఏమిటి? అలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవటం ద్వారా.. తగిన జాగ్రత్తలతో పడిపోయే ముప్పును తప్పించుకోవచ్చని చెబుతున్నారు. శరీరాన్ని సమస్థితిలో ఉంచేందుకు చెవి కీలకంగా వ్యవహరిస్తుందని.. పెద్ద వయసులో చెవి ఇన్ ఫెక్షన్లు సర్వసాధారణమని.. వీటిలో చోటు చేసుకునే సమస్యలు శరీరాన్ని బ్యాలెన్సు చేసే అంశంపై ప్రభావం చూపుతాయంటున్నారు.

పెద్ద వయస్కులు ఏదో ఒక ఔషధాలను వాడుతుంటారన్న సంగతి తెలిసిందే. యాంటీ డిప్రెషన్.. న్యూరో లెప్టిక్ డ్రగ్స్.. యాంటి హిస్టమిన్స్.. ఫిట్స్ కు వాడే మందులతోనూ కళ్లు తిరిగి పడిపోయే అస్కారం ఉంటుందని.. గుండె దడకు సంబంధించిన కొన్ని మందులతో..పెయిన్ కిల్లర్లతోనూ మత్తు వచ్చి తూలిపడే ముప్పు ఉంటుందని చెబుతున్నారు. మరికొందరిలో లేచి నిలబడగానే కొందరిలో రక్తపోటు సాధారణం కంటే తక్కువకు పడిపోతుంది. దీంతో స్ప్రహ కోల్పోతారు. దీన్ని ఆర్థో స్టాటిక్ హైపోటెన్షన్ గా పేర్కొంటారు.

షుగర్ లెవల్స్ తగ్గిపోవటం.. వాడే మందుల మోతాదులు ఎక్కువ, తక్కువ అయినా కింద పడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. పదే పదే కళ్లు తిరిగిపడిపోతున్నారంటే.. అయోటిక్ స్టెనోసిస్ వ్యాధి ఉందా? అన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుందని.. కాళ్ల నుంచి చెప్పులు జారిపోతున్నాయంటూ పెరిఫిరల్ న్యూరోపతి అయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించాలని చెబుతున్నారు. పెద్ద వయసులో తూలి పడిన ఉదంతాల్లో ఎక్కువమంది తుంటి ఎముక విరిగిపోవటం.. ఎముకలు బ్రేక్ కావటం లాంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అలా జరిగినప్పుడు దీర్ఘకాలం బెడ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల మంది తుంటి ఎముకలు విరిగి ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోందని.. ఈ బాధితుల సంఖ్య భవిష్యత్తులో 62 లక్షలకు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్కవ కాలం పడకకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వారు చేసుకునే పనుల పరిధి తగ్గిపోతుంది. దీంతో మానసిక సమస్యలు ఎదురవుతుంటాయి.

మరి.. ఈ సమస్య ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్త మాటేమిటి? అన్న విషయాన్ని చూస్తే.. ఎవరైనా పేషెంట్ తాము కూర్చున్న చోటు నుంచి 3 మీటరలు నడవాలని చెబుతుంటారు. మళ్లీ వచ్చి కూర్చోమంటారు. ఆ సమయంలో శరీరం సమస్థితిలో ఉందా? నడకలో అడుగులు తడబడుతున్నాయా? కుర్చీలో నుంచి లేచి నిలబడటానికి పది సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారా? అడుగుకు అడుగుకు మధ్య దూరం తగ్గుతుందా? నడవాటానికి ఎక్కువ టైం తీసుకుంటున్నారా? లాంటి వాటిని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద వాళ్లు కళ్లు తిరుగుతున్నాయంటే.. ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి. వైద్యులను సంప్రదించాలి. అన్నింటికి మించి.. బాత్రూంలో తడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. పెద్ద వయస్కులు బాత్రూం నుంచి బయటకు వచ్చే వేళలో.. గోడను.. తలుపులను పట్టుకొని వచ్చేలా వారిని సిద్ధం చేయటం ద్వారా ముప్పును కాస్తంత నివారించే వీలుంది.