బతుకమ్మ చీరల బిల్లు పెండింగేంది సామీ..?
తాజాగా బయటకు వచ్చిన పచ్చి నిజం ఏమంటే.. బతుకమ్మ చీరలకు సంబంధించి గత బీఆర్ఎస్ సర్కారు రూ.220 కోట్ల బకాయిల్ని చెల్లించలేదు.
By: Tupaki Desk | 18 Jan 2024 11:30 AM GMTచేతికి మైకు చిక్కితే చాలు.. వెనుకా ముందు చూసుకోకుండా నీతులు చెప్పే అలవాటున్న మాజీ మంత్రి కేటీఆర్.. చేతిలో ఉన్న పవర్ చేజారిన తర్వాత మరింత ఎక్కువైంది. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కుదురుకోవటానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందన్న చిన్న విషయాన్ని సైతం పట్టించుకోకుండా అదే పనిగా విమర్శలు గుప్పించే తీరు వెగటు పుట్టేలా మారిందంటున్నారు. ఈ విషయం కాదు ఆ విషయం కాదు.. ప్రతి అంశంలోనూ వేలెత్తి చూపే తీరును కేటీఆర్ ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రేవంత్ సర్కారు లోపాల్ని చూపించే ఆయన.. తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనకు సంబంధించి వెలుగు చూస్తున్న సిత్రాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బతుకమ్మ చీరల పేరుతో కేసీఆర్ సర్కారు చేసుకున్న ప్రచారం అంతా ఇంతా కాదు. చేనేత కార్మికుల కష్టంతో తయారు చేయించే బతుకమ్మ చీరల బిల్లుల్ని నెలల తరబడి పెండింగ్ ఉంచటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. సంక్షోభంలో కొట్టుమిట్లాడే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవటానికి బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వటం ద్వారా వారికి చేయూతగా నిలుస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వటం తెలిసిందే.
తాజాగా బయటకు వచ్చిన పచ్చి నిజం ఏమంటే.. బతుకమ్మ చీరలకు సంబంధించి గత బీఆర్ఎస్ సర్కారు రూ.220 కోట్ల బకాయిల్ని చెల్లించలేదు. భారీగా పెండింగ్ లో ఉన్న బకాయిల కారణంగా.. చేనేత కార్మికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. బకాయిల్ని చెల్లిస్తామని అప్పటి మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ చెప్పినప్పటికీ.. మాటలే తప్పించి చేతల్లో చూపించలేని పరిస్థితి. ఇలాంటి వేళ.. కేసీఆర్ సర్కారు నాటి బకాయిల్ని నేటి రేవంత్ సర్కారు తీరిస్తే.. ఆర్థిక ఇబ్బందుల నుంచి కాస్తంత బయటపడే వీలుందని చెబుతున్నారు. ఆదర్శాలు దంచే కేటీఆర్.. బతుకమ్మ చీరల బిల్లులు క్లియర్ చేయించాలన్న ఆలోచన లేకపోవటం ఏమిటి కేటీఆర్? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.