భూమ్మీదకు దూసుకొస్తున్న 3వేల కేజీల బరువున్న 9 బ్యాటరీలు
అక్షరాల మూడు వేల కేజీల బరువు ఉన్న తొమ్మిది బ్యాటరీలు అంతరిక్షం నుంచి భూమ్మీదకు దూసుకు వస్తున్నాయి
By: Tupaki Desk | 9 March 2024 12:25 PM GMTఅక్షరాల మూడు వేల కేజీల బరువు ఉన్న తొమ్మిది బ్యాటరీలు అంతరిక్షం నుంచి భూమ్మీదకు దూసుకు వస్తున్నాయి. ఇప్పుడేం జరుగుతుంది? అంతర్జాతీయ కేంద్రం నుంచి వస్తున్న ఈ బ్యాటరీలు 2021లోనే ఐఎస్ఎస్ నుంచి వేరుపడ్డాయి. అప్పటి నుంచి అంతరిక్షంలో ఉన్న ఆ బ్యాటరీలతో ఇప్పుడేం జరుగుతుందన్నది ప్రశ్నగా మారింది. అయితే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అంతరిక్ష కేంద్రం నుంచి పైకి విసిరిన అత్యంత భారీ వస్తువులుగా వీటిని చెప్పాలి. ఏవైనా ఉపయోగించిన వస్తువుల్ని.. వాటి అవసరం తీరిన తర్వాత ఇలా పారేయటం అంతరిక్ష కేంద్రంలో మామూలే. అయితే.. అవన్నీ భూ వాతావరణంలో ప్రవేశించినంతనే ఎలాంటి హాని చేయకుండా కాలిపోతాయి. ఆ కోవలోకే తాజాగా భూమ్మీదకు దూసుకొచ్చే బ్యాటరీలు ఉంటాయని చెబుతున్నారు. అయితే.. ఇంత భారీ స్థాయిలో ఉన్న వస్తువులు ఇప్పటివరకు భూవాతావరణం మీదకు రాలేదన్న మాటను ప్రస్తావిస్తూ.. ఏం జరుగుతుందన్న ఉత్సుకత వ్యక్తమవుతోంది.
మార్చి 8 మధ్యాహ్నం నుంచి మార్చి 9 మధ్యలో భారీ అంతరిక్ష శకలం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని జర్మనీలోని నేషనల్ వార్నింగ్ సెంటర్ వెల్లడించింది. పలు నివేదికల ప్రకారం ఈ బ్యాటరీలు భూమికి ఎలాంటి హాని కలిగించవని చెబుతున్నారు. అవి భూవాతావరణంలోకి ప్రవేశించినంతనే కాలిపోయి బూడిదగా మారతాయని చెబుతున్నారు. అయితే.. వాటిలో కొన్ని శకలాలు మాత్రం భూమి మీదకు చేరే వీలుందని చెబుతున్నారు. అయితే.. వాటితోనూ ఎలాంటి హాని ఉండదని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో ఇవి పడే చోటు ఎక్కడన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అయితే.. వాటికి సంబంధించి శాస్త్రవేత్తలు ఏకాభిప్రాయానికి రాలేదు. అయితే.. అంతరిక్షం నుంచి భూమి మీదకు శకలాలు దూసుకురావటం కొత్తేమీ కాదని.. ప్రతి రోజూ ఉపగ్రహాల నుంచి వ్యర్థాలు భూమి మీదకు పడుతుంటాయని చెబుతున్నారు. కొన్ని వేల ఏళ్లుగా ఇలాంటివి సాగుతున్నాయని.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమ్మీదకు దూసుకొస్తున్న వస్తువుల విషయంలో కొంత ఆందోళన సహజమేనని చెబుతున్నారు.