రీల్ మించి రియల్: దోచేందుకు సరిపోదా గురువారం
ఇప్పుడు చెప్పేది సినిమా కథ కాదు. రియల్ స్టోరీ. అది కూడా అవాక్కు అయ్యేంతలా ఉండే రియల్ క్ట్రైం స్టోరీ.
By: Tupaki Desk | 5 Feb 2025 7:33 AM GMTఇప్పుడు చెప్పేది సినిమా కథ కాదు. రియల్ స్టోరీ. అది కూడా అవాక్కు అయ్యేంతలా ఉండే రియల్ క్ట్రైం స్టోరీ. శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఒక పబ్ వద్ద మోస్ట వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసుల మీద కాల్పులు జరపటం.. అయినప్పటికి అతన్ని పట్టుకోవటం తెలిసిందే. ఈ సందర్భంగా అతడి దగ్గర రెండు పిస్టల్స్ దొరికాయి. కట్ చేస్తే.. ఆ తర్వాత అతగాడిని పోలీసులు విచారణ జరిపిన వేళ.. మొత్తం 80 దొంగతనాల్ని చేసినట్లుగా తేల్చారు. అది కూడా అలాంటి ఇలాంటి ప్లానింగ్ కాదు.
కన్నేస్తే ఖతమయ్యాలన్నట్లుగా అతడి తీరు ఉండటం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ మధ్యన హీరో నాని నటించిన సరిపోదా శనివారం మూవీలో.. తన కోపాన్ని చూపించేందుకు శనివారం ఒక్కరోజే చూపిస్తాడు. ఆ సినిమాలో మాదిరే బత్తుల చోరీలకు కేవలం గురువారం మాత్రమే చేస్తాడు. తాను స్పాట్ డిసైడ్ చేసుకున్న తర్వాత మంగళ.. బుధవారాల్లో పక్కాగా రెక్కి చేయటం.. గురువారం చోరీ చేయటం అతగాడి టాలెంట్. ఈ రెక్కికి ముందు వారాల తరబడి పక్కాగా ప్లాన్ చేస్తుంటాడని తేల్చారు.
గచ్చిబౌలిలోని ఒక విలావంతమైన ట్రిఫుల్ బెడ్రూంలో నివాసం ఉండే ఇతడు.. తాను చేసే చోరీలకు పక్కా ప్లానింగ్ కోసం.. సినిమాల్లో మాదిరి ఒక బెడ్రూంలో సెటప్ చేసుకున్న వైనం పోలీసులకుసైతం విస్మయానికి గురి చేసింది. అంతేకాదు.. అతడు వాడే అన్నివస్తువులు బ్రాండెడ్ కావటం.. విలువైనవి కావటం ఒకటైతే.. ఇంతలా ఖర్చు పెట్టినా ఇతగాడి పేరు మీద ఒక్కటంటే ఒక్క బ్యాంక్ ఖాతా లేకపోవటం మరో విశేషంగా చెప్పాలి.
ఇక.. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ధూమ్ ను స్ఫూర్తిగా తీసుకున్న అతను.. అందులోని హీరో మాదిరి సూపర్ చోరీలు చేయాలన్నది అతడి ఆలోచనగా పోలీసులు చెబుతున్నారు. తన ఛాతీకి రెండు వైపులా రెండు టాటూలు వేయించుకున్న అతను.. ఒక వైపు ‘‘3’’ నెంబరును.. మరో వైపు ‘‘100’’నెంబర్లు వేయించుకోవటంతో.. ఆ వివరాల్నిఅతడి నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు.దీనికి అతను ఇచ్చిన సమాధానం విన్న పోలీసులు సైతం అవాక్కు అయినట్లుగా తెలుస్తోంది. ఎందుకుంటే.. ‘3’ నెంబరుకు అర్థం..ఒకే చోరీలో రూ.3 కోట్ల భారీ మొత్తాన్ని దోచుకోవాలన్న తన కమిట్ మెంట్ ను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవటానికి ఆ సంఖ్యను.. కనీసం వంద మంది అమ్మాయిల్ని ట్రాప్ చేయాలన్న తన లక్ష్యాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో అవాక్కు కావటం పోలీసుల వంతైంది.
ఈ క్రమంలో ఇప్పటివరకు 40 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసినట్లుగా అతను చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగా ఏపీకి చెందిన ఒక అమ్మాయిని వారానికి ఒకసారి ప్లాట్ కు పిలిచేవాడని.. ప్రతిసారీ రూ.30 వేలు ఇచ్చినట్లుగా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదివిన ఇతను ఇప్పటివరకు ఏ సందర్భంలోనూ టార్గెట్ మిస్ కాలేదని చెప్పినట్లు తెలుస్తోంది. బిహార్ కు వెళ్లి పిస్టల్స్ కొనుక్కొచ్చిన అతను.. 500 బుల్లెట్లను తీసుకొచ్చినట్లుగా గుర్తించారు. ఇందులో వంద రౌండ్లను ప్రాక్టీస్ కోసం వినియోగించినట్లుగా గుర్తించారు. ఇతగాడు ఇచ్చిన సమాచారం మొత్తం సినిమాటిక్ గా ఉండటంతో ఇతడ్నిమరింత లోతుగా విచారించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మరిన్ని సంచలనాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.