Begin typing your search above and press return to search.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నడవదు ‘భయ్యా’.. సన్నీ యాదవ్ పై కేసు

ఇక బెట్టింగ్ యాప్ లను కొందరు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేస్తుండడం వివాదంగా మారుతోంది.

By:  Tupaki Desk   |   12 March 2025 4:08 PM IST
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నడవదు ‘భయ్యా’.. సన్నీ యాదవ్ పై కేసు
X

బెట్టింగ్.. తెలుగులో చెప్పాలంటే జూదం.. ఎప్పుడైనా ఎక్కడైనా మంచిది కాదు.. ఒక్కమాటలో వివరిస్తే.. బెట్టింగ్ అనేది అన్ స్కిల్డ్ గేమ్.. సరదాగా తీసుకుంటూ లక్ ను నమ్ముకుని చాలామందికి వ్యసనంగా మారి చివరకు అప్పుల పాల్జేస్తుంది బెట్టింగ్. కాగా, స్మార్ట్ ఫోన్లు బాగా పెరిగిపోయి.. తేలిగ్గా రుణాలిచ్చే సంస్థలు కూడా రావడంతో బెట్టింగ్ అనేది మరింత చెలరేగిపోతోంది.

ఇక బెట్టింగ్ యాప్ లను కొందరు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేస్తుండడం వివాదంగా మారుతోంది. సమాజంలో తమకు ఉన్న పేరును వారు ఇలా దుర్వినయోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా వచ్చిన పేరును మంచి పనులకు కాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వంటివాటికి వాడడం ఎంతైనా చెడు పరిణామమే.

ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తప్పవంటూ ఆదేశాలిచ్చింది.

గత నెలలో ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన లోకల్ బాయ్ నాని అనే పేరున్న యూట్యూబర్ పై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నందుకు కేసు నమోదైంది. తాజాగా తెలంగాణకు చెందిన యూట్యూబూర్ భయ్యా సన్నీ యాదవ్ పైనా కేసు పెట్టారు.

భయ్యా సన్నీ యాదవ్ అలియాస్ భయ్యా సందీప్ మోటో వ్లాగర్. అంటే బైక్ పై వివిధ ప్రదేశాలను చుట్టొచ్చే వారు అన్నమాట.

వాస్తవానికి సన్నీ యాదవ్ యూట్యూబ్ చానల్ ఎట్ భయ్యా సన్నీ యాదవ్ కు 47.6 లక్షల మంది సబ్ స్ర్కైబర్స్ ఉన్నారు. అంటే దగ్గరదగ్గరగా అరకోటి మంది అన్నమాట.

వివిధ ప్రాంతాలకు బైక్ మీద పర్యటనలు చేస్తూ 1400 వరకు వీడియోలు చేసిన సన్నీయాదవ్ కు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాడన్న చెడ్డ పేరు వచ్చింది. గత ఏడాది మరో ప్రముఖ తెలుగు యూట్యూబర్, ట్రావెలర్ అన్వేష్ దీనిని బయటపెట్టాడు. అప్పట్లో ఇద్దరి మధ్య యూట్యూబ్ వేదికగానే తీవ్ర వాగ్వాదం జరిగింది.

తాజాగా సన్నీ యాదవ్ పై తెలంగాణలోని నల్లగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు గాను అతడిపై సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

బెట్టింగ్ యాప్స్ భూతంగా మారిన వైనాన్ని తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ కూడా ప్రస్తావించారు. విదేశంలో ఉన్న అన్వేష్ తో ఆయన వీడియో స్ట్రీమింగ్ చేశారు. కాసులకు కక్కుర్తి పడి అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడతానంటే కుదరదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భయ్యా సన్నీయాదవ్ పై కేసు నమోదు కావడం గమనార్హం.