మోడీ ఎఫెక్ట్: ఆఫీస్ ఎత్తేసిన బీబీసీ!
ప్రపంచ వ్యాప్త దిగ్గజ మీడియా సంస్థ.. బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) తన భారతీయ కార్యాల యాన్ని మూసేసింది.
By: Tupaki Desk | 8 April 2024 5:30 PM GMTప్రపంచ వ్యాప్త దిగ్గజ మీడియా సంస్థ.. బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) తన భారతీయ కార్యాల యాన్ని మూసేసింది. ముంబైలో రెండు అంతస్థుల్లో విస్తరించి ఉన్న బీబీసీ కార్యాలయాన్ని మూసివేస్తు న్నట్టు తెలిపింది. అయితే.. జర్నలిజం విషయంలో రాజీ పడబోమని.. ఒకరికి ఇష్టంతో అయిష్టంతో తమకు సంబంధం లేదని.. ప్రజలే తమకు దేవుళ్లని బీబీసీ పేర్కొంది. ప్రత్యక్షంగా తమ కార్యాలయం మూసేసినా.. తన విలేకరులు దేశవ్యాప్తంగా ఉంటారని.. ఫ్రీ లాన్సర్లుగా వారు పనిచేస్తారని తెలిపింది.
కలెక్టివ్ న్యూస్ రూమ్ పేరుతో తమ ప్రసారాలు కొనసాగుతాయని తెలిపింది. తాము ఎవరికీ భయ పడబో మని పదే పదే బీబీసీ పేర్కొనడం గమనార్హం. కాగా.. స్వాతంత్య్రానికి పూర్వమే.. దేశంలో బీబీసీ రేడియో పేరుతో తన ప్రసారాలు ప్రారంభించింది. 1940లో ముంబై కేంద్రంగా ఏర్పాటైన ఈ సంస్థ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు మారుతున్న కాలానికి అనుగుణంగా.. తన ప్రసారాలను ప్రజలకు చేరువ చేసింది. అదేసమయంలో బీబీసీ అంటే.. ఒక విశ్వసనీయత అనే పేరు తెచ్చుకుంది.
ఇందిరమ్మ.. ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా.. బీబీసీ తడబడలేదు. నిష్పాక్షికంగా.. తన ప్రసారాలు సాగించింది. ఇక, నెహ్రూ హయంలో తీసుకున్న నిర్ణయాలను తీవ్ర విమర్శలతో ప్రసారం చేసిన సందర్భాలు ఉన్నాయి. రామజన్మభూమి, రామసేతు వంటి వివాదాలు వచ్చినప్పుడు అసలు ఏం జరిగిందనే విషయాన్ని పూస గుచ్చినట్టు వివరించింది. నిజానికి దేశంలో ఉన్న మీడియా సంస్థలు కూడా బీబీసీ కంటెంటును కొనుగోలు చేసుకున్నాయంటే.. ఆశ్చర్యం వేస్తుంది.
మరి ఇప్పుడు ఏం జరిగింది?
ప్రధాని నరేంద్ర మోడీ ఎఫెక్ట్.. బీబీసీపై భారీగా పడింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న గోద్రాఘటనలపై బీబీసీ `ఇండియా: ది మోడీ క్వశ్చన్` పేరుతో డాక్యుమెంటరీలు వెలుగులోకి తెచ్చింది. గత ఏడాది తీవ్ర వివాదాలు.. విమర్శలు.. రాజకీయ కోపతాపాలకు ఇది కారణమైంది. ఈ క్రమంలోనే బీబీసీ కార్యాలయాలపై 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఐటీ అధికారులు దాడులు చేయడం.. నోటీసులు ఇవ్వడం వంటివి తెరమీదికి వచ్చాయి. దీంతో బీబీసీ ఏకంగా మూసివేత నిర్ణయం తీసుకోవడం గమనార్హం.