ఏపీ రాజకీయం మొత్తం బీసీల చుట్టూ... వారి ఓటు బ్యాంకెంత... వేసేదెంత..!
ఏపీ రాజకీయం అనూహ్యంగా బీసీలవైపు మళ్లింది. బీసీలను తన వెన్నెముకగా పేర్కొనే టీడీపీని దెబ్బ కొట్టే వ్యూహంతో వైసీపీ సుమారు 70 నుంచి 80 స్థానాలను బీసీలకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 16 Dec 2023 5:30 PM GMTఏపీ రాజకీయం అనూహ్యంగా బీసీలవైపు మళ్లింది. బీసీలను తన వెన్నెముకగా పేర్కొనే టీడీపీని దెబ్బ కొట్టే వ్యూహంతో వైసీపీ సుమారు 70 నుంచి 80 స్థానాలను బీసీలకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరిని ఇప్పటికే మార్పుల దిశగా ఒప్పించిందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక, రాబోయే రోజుల్లో బీసీల కోసం.. మరిన్ని మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. ఈ పరిణామంతో టీడీపీ కూడా అలెర్ట్ అయింది.
బీసీలకు ఎక్కువగా టికెట్లు ఇచ్చే పార్టీగా పేరున్న టీడీపీ.. ఇప్పుడు వైసీపీ వ్యూహంతో ఒకింత తర్జన భర్జ న పడే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. తమ దగ్గర టికెట్ దక్కని వారికి అవసరమైతే.. వైసీపీ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందని పార్టీ కీలక నాయకులు అంచనా వేస్తున్నారు. దీంతో బీసీల్లో బలమైన నాయకు లను ఆర్థికంగా సత్తా ఉన్న నేతలను జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక, బీసీలకు మేలు విషయం లోనూ వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య కూడా విమర్శలు పెరుగుతున్నాయి.
వైసీపీలోకి బీసీ మంత్రులు.. టీడీపీకి సవాళ్లు రువ్వుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని చెబుతున్నారు. బీసీలకు మేలు చేశామంటూ.. దస్తావేజులు తిరగేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీసీల రాజకీయం దుమారం రేపుతోంది. పులివెందుల నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించాలని చంద్రబాబు సవాల్ రువ్వగా.. కుప్పం నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారంటూ.. వైసీపీ నాయకులు ఎదురు దాడి చేశారు.
ఈ క్రమంలోనే బీసీలకు ఎవరు ఏం చేశారనే ప్రశ్నలు కూడా తెరమీదికి వచ్చాయి. ఇదిలావుంటే.. గత ఎన్నికల్లో బీసీల ఓటు బ్యాంకు ఎలా ఉంది? ఎవరికి పడింది? అనే విషయాలను పరిశీలిస్తే.. మొత్తం బీసీల ఓటు బ్యాంకులో 42 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెజారిటీగా రెడ్డి సామాజిక వర్గమే ఓట్లను పూర్తిస్థాయిలో వినియోగించుకుంది.
రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నెల్లూరు, అనంతపురం వంటి జిల్లాల్లో.. వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. సో.. ఈ పరిణామాల ను బట్టిబీసీల గురించి పార్టీలు విర్శించుకోవడం కాకుండా.. బీసీలను ఓటు బ్యాంకు వరకు నడిపిస్తేనే వారి వల్ల ప్రయోజనం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.