Begin typing your search above and press return to search.

బోయింగ్ 737తో జర జాగ్రత్త.. డీజీసీఏ ఏం చెప్పింది?

ఇదిలా ఉండగా.. తాజాగా దేశీయ విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (పొట్టిగా పిలవాలంటే డీజీసీఏ) బోయింగ్ 737కు సంబంధించి కీలక ప్రకటన చేసింది.

By:  Tupaki Desk   |   8 Oct 2024 9:30 AM GMT
బోయింగ్ 737తో జర జాగ్రత్త.. డీజీసీఏ ఏం చెప్పింది?
X

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన సియాటిల్ కేంద్రంగా ఉన్న బోయింగ్ సంస్థను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో బోయింగ్ విమానం అన్నంతనే ఎలాంటి భయం ఉండేది కాదు. కానీ.. ఎప్పుడైతే బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాల తర్వాత మాత్రం బోయింగ్ మాట విన్నంతనే కొత్త టెన్షన్ వచ్చే పరిస్థితి. ఈ మోడల్ కు చెందిన రెండు విమానాలు కూలిపోవటం.. 300 మందికి పైగా ప్రయాణికులు మరణించటంతో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ఉత్పత్తిని ఆపేశారు.

బోయింగ్ 737మ్యాక్స్ విమానాల్లోని ఒక కొత్త ఫీచర్ లో సమస్యలు తలెత్తటంతో ఇండోనేషియా.. ఇథియోపియాల్లో విమానాలు కూలిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే బోయింగ్ ఇమేజ్ ను ఈ ఎపిసోడ్ చాలానే డ్యామేజ్ చేసిన పరిస్థితి . నిజానికి ఈ మోడల్ కు సంబంధించి బోయింగ్ వద్ద 400 వరకు విమానాలుఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలానే విమానయాన సంస్థలు ఈ మోడల్ విమానాల్ని కొనుగోలు చేసేందుకు ఆర్డర్లు ఇచ్చినప్పటికి.. వీటిలోని సాఫ్ట్ వేర్ సమస్యల్ని పరిష్కరించేందుకు డెలివరీని తాత్కాలికంగా ఆపేశారు.

ఇదిలా ఉండగా.. తాజాగా దేశీయ విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (పొట్టిగా పిలవాలంటే డీజీసీఏ) బోయింగ్ 737కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. దేశీయ విమాన సంస్థలు బోయింగ్ 737తో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఆ విమానాల్లో రడ్డర్ నియంత్రణ వ్యవస్థ మొరాయిస్తుందని.. దీంతో జాగ్రత్తగా ఉండాలన్న సూచన చేసింది.

విమానాల వర్టికల్ యాక్సిస్ ను నియంత్రించే వ్యవస్థే రడ్డర్. ఈ మధ్యనే బోయింగ్ 737 విమానాల భద్రతపై అమెరికా నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్ టీఎస్ బీ)దర్యాప్తు రిపోర్టు వెలువరించింది. ఇందులో రడ్డర్ నియంత్రణ వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో డీజీసీఏ స్పందించింది. భారత విమానయాన సంస్థలకు డీజీసీఏ భద్రతా నియమావళిని ఇచ్చింది.

ప్రస్తుతం మన దేశంలో బోయింగ్ 737 విమానాల్ని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్.. స్సైస్ జెట్.. ఆకాశ ఎయిర్ సంస్థలు వినియోగిస్తున్నాయి. అన్ని సంస్థలు బోయింగ్ 737 విమానాలపై భద్రతాపరమైన పరీక్షలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో.. మరోసారి బోయింగ్ విమానాల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చినట్లైంది. ఏమైనా.. ఈమధ్యన బోయింగ్ టైం బాగోలేదన్న మాటకు బలం చేకూరేలా తాజా పరిణామాలు ఉన్నాయని చెప్పక తప్పదు.