హాట్ టాపిక్ : బీచ్ కారిడార్ ప్రాజెక్ట్ తో వేల భవంతులు కూల్చేస్తారా...?
ఇంతకీ బీచ్ కారిడార్ ప్రాజెక్ట్ ఏంటి దాని రూపు రేఖలు ఎలా ఉంటాయి అన్నది కనుక చూస్తే విఎమ్మార్డీయే యే ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసింది.
By: Tupaki Desk | 15 Nov 2023 1:30 AM GMTఉత్తరాంధ్రాకు కలికితురాయిగా భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతోంది. దాంతో పాటు బీచ్ కారిడార్ ప్రాజెక్ట్ ని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా బీచ్ రోడ్డుని విశాఖ నుంచి భోగాపురం దాకా భారీగా విస్తరిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఇపుడు ఉన్న రోడ్లను డబుల్ చేస్తారు అన్న మాట.
ఈ విధంగా చేయడం వల్ల చాలా ఇళ్ళు బీచ్ రోడ్లులో నేలమట్టం అవుతాయన్న ఆందోళన అయితే మొదలైంది. ఇంతకీ బీచ్ కారిడార్ ప్రాజెక్ట్ ఏంటి దాని రూపు రేఖలు ఎలా ఉంటాయి అన్నది కనుక చూస్తే విఎమ్మార్డీయే యే ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసింది.
విజయనగరం జిల్లాలోని భోగాపురం లో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖలోని పోర్టు కంటైనర్ టెర్మినల్ దాకా హద్దులు పెట్టుకుని మరీ వందల కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. ఇలా నాలుగు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ ని నిర్మాణం చేస్తున్నారు.
విశాఖ పోర్టు టెర్మినల్ నుంచి కైలాసగిరి దాకా 7.70 కిలోమీటర్ల పొడవున నలభై మీటర్ల రహదానికి విస్తరించాలని విఎమ్మార్డీయే చూస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో బీచ్ రోడ్డు 24 నుంచి 30 మీటర్లు మాత్రమే ఉంది. దాన్ని నలభై మీటర్లు అంటే మరో పది మీటర్ల మేర విస్తరించవలసి ఉంటుంది. దాంతో ఒక వైపు సముద్రం ఉండడంతో రెండవ వైపు ఉన్న భారీ భవంతులనే కూల్చాల్సి వస్తుంది అని అంటున్నారు.
అదే విధంగా కైలాసగిరి నుంచి జోడుగుళ్ళపాలెం దాకా 0.08 కిలోమీటర్ల మేర రోడ్డు వెడల్పు చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ 18 నుంచి 24 మీటర్ల దాకా రోడ్డు ఉంది. దాన్ని ఏకంగా 45 మీటర్లకు విస్తరించాలంటే చాలా ఇళ్ళు కూల్చివేతకు గురి అవుతాయని అంటున్నారు. అలాగే జోడుగుళ్ళ పాలెం నుంచి భీమిలీ దాకా 18.75 కిలోమీటర్ల మేర ఉన్న 24 నుంచి 30 మీటర్ల రోడ్డుని అరవై మీటర్ల రోడ్డుగా విస్తరిస్తారు. అదే కనుక జరిగితే ఈ ప్రాంతంలో ఉండే భారీ భవంతులు ఇళ్ళు కూడా నేలమట్టం కావాల్సిందే అంటున్నారు.
ఇక భీమిలీలోని నేరళ్ళవలస నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయం దాకా ఉన్న 2-10 కిలోమీటర్ల రోడ్డుని 75 అడుగులుగా విస్తరిస్తారు. ఇలా మొత్తం చూస్తే రోడ్డు విస్తరణలో భారీ భవనాలే కాదు సామాన్యుల ఇళ్ళు పేదల ఇళ్ళు కూడా మొత్తంగా కూలిపోయే ప్రమాదం ఉంది అని అంటున్నారు.
ఈ మొత్తం బీచ్ రోడ్డు ప్రాంతంలో అనేక రిసార్టులు ఉన్నాయి. రైతుల భూములు ఉన్నాయి. ప్రైవేట్ స్థలాలు ఉన్నాయి. చాలా విలువైన భూములను కొల్లగొడితే ఎలా అన్నదే ఆవేదనగా ఉంది. మరి దీనికి సమాధానం దొరక్క చాలా మంది ఆందోళన చెందుతున్నారు. బీచ్ కారిడార్ ప్రాజెక్ట్ మంచిదే కానీ ఆ కారణంతో ఉన్న భవంతులు కూలగొట్టడం వల్ల ఎంతో మందికి ఇబ్బందు కలగడమే కాకుండా ఆర్ధిక ప్రయోజనాలు దెబ్బతింటాయని అంటున్నారు. కూల్చేస్తే ఎలా అని కూడా అపుడే ఆందోళనలు నిరసనలు మొదలయ్యాయి. దీనికి వీఎమ్మార్డీయే అధికారులు ఏమి జవాబు చెబుతారు. ప్రభుత్వం వైపు నుంచి ఏమని బదులు వస్తుంది అన్నది చూడాల్సి ఉంది. మరో వైపు ఇది జస్ట్ ఒక ప్రతిపథాన ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని కూడా అంటున్నారు.