"నల్లులపై దండయాత్ర"... ఫ్రాన్స్ ప్రభుత్వం పిలుపు!
ఇదే క్రమంలో తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా దాదాపు ఇలాంటి పిలుపునే ఇస్తుంది. పేరు నల్లులపై దండయాత్ర కాకపోయినా కాన్సెప్ట్ మాత్రం ఆల్ మోస్ట్ అదే. ఇప్పుడు ఆ దేశానికి ఉన్న అతిపెద్ద సమస్య నల్లులే!
By: Tupaki Desk | 1 Oct 2023 3:00 AM GMTగతంలో టీడీపీ ప్రభుత్వంలో విపరీతంగా పెరిగిపోతోన్న దోమల నివారణలో భాగంగా "దోమలపై దండయాత్ర" కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా దాదాపు ఇలాంటి పిలుపునే ఇస్తుంది. పేరు నల్లులపై దండయాత్ర కాకపోయినా కాన్సెప్ట్ మాత్రం ఆల్ మోస్ట్ అదే. ఇప్పుడు ఆ దేశానికి ఉన్న అతిపెద్ద సమస్య నల్లులే!
అవును... వచ్చే ఏడాది ఒలెంపిక్స్ కోసం రెడీ అవుతున్న పారిస్ లో ఇప్పుడు నల్లుల సమస్య ఎక్కువైపోతోంది. దీంతో ఈ దేశం నల్లులపై యుద్ధం ప్రకటించింది. అయితే ఇది ఈ మధ్యే ప్రకటించింది కాదు సుమా... మూడేళ్ల క్రితమే ఫ్రాన్స్ ప్రభుత్వం నల్లులపై యుద్ధాన్ని ప్రకటించింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ తో పాటు ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు పరిస్థితి ఏ స్థాయిలో ఉందో!
ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్ లో నల్లుల బెడద ఎక్కువగా ఉందంటే నమ్మడానికి కాస్త వింతగానే అనిపించొచ్చు కానీ ఇది నిజం! ముఖ్యంగా రాజధాని పారిస్ లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. బస్సు సీట్లు, సినిమా హాళ్లు అనే తేడా లేకుండా నగరమంతా ఇవి వ్యాపించాయి.
పారిస్ లో ఇటీవలి కాలంలో నల్లుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనికి సంబంధించిన అనేక పోస్టులు, వాటి కింద కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. నల్లుల విషయంలో సిటీలో ఎవరూ ప్రశాంతంగా లేరని పారిస్ ఉప మేయర్ ఇమాన్యుయేల్ గ్రెగోయిర్ చెప్పారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఒలింపిక్ క్రీడల నిర్వహణకు పారిస్ సిద్ధమవుతోంది. దీంతో... ఈ పరిణామాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా నల్లుల నివారణకు తగు చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా ఇచ్చింది. ఈ సమస్యతో ఒలింపిక్ క్రీడలకు ఎటువంటి ముప్పు లేదని.. అయితే, వాటి నివారణకు అందరూ కలిసి పనిచేయడానికి ఒలింపిక్స్ ఒక అవకాశం అని ఉప మేయర్ గ్రెగోయిర్ తెలిపారు.
ఏది ఏమైనా... ఫ్రాన్స్ లాంటి దేశం, పారిస్ లాంటి నగరం ఇలా నల్లులతో ఇబ్బంది పడుతుందంటే ఆశ్చర్యకరమైన విషయమే!