టీడీపీలో మడకశిర రగడ.. ఎన్నికలకు ముందు కాక!
గుండుమల వర్గానికే టీడీపీ టికెట్ కేటాయించాలని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఉద్రిక్తతకి దారితీసింది.
By: Tupaki Desk | 6 March 2024 5:13 AM GMTప్రధాన ప్రతిపక్షం టీడీపీలో టికెట్ల రగడ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురంలో ఇప్పటికే ధర్మవరం సీటు వ్యవహారం కాక రేపుతుండగా.. తాజాగా ఈ జాబితాలో మడకశిర నియోజకవర్గం చేరింది. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పే స్వామి ఇంటి ముందు టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. గుండుమల వర్గానికే టీడీపీ టికెట్ కేటాయించాలని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఉద్రిక్తతకి దారితీసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయిన కార్యకర్త చంద్రశేఖర్ అని గుర్తించి.. పక్కనే ఉన్న పార్టీ నేతలు ఆయన్ను అడ్డుకున్నారు.
ఏం జరిగిందంటే.. మడకశిర నియోజకవర్గ టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే ఈరన్న కొడుకు సునీల్ కుమార్ కు కేటాయించారు. తొలి జాబితాలోనే చంద్రబాబు ఆయనకు అవకాశం ఇచ్చారు. అయితే.. ఇది టీడీపీలో వర్గ విభేదాలకు దారితీసింది. సునీల్ కుమార్ కు టికెట్ ఇచ్చినందుకు నిరసనగా మడకశిర పట్టణంలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి నివాసం నుండి వందల మంది పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ తప్పించి వేరే ఎవరికైనా ఇస్తేనే పనిచేస్తామని లేకపోతే పార్టీకి పనిచేసే ప్రసక్తే లేదని కార్యకర్తలు తేల్చి చెప్పారు.
గత కొంతకాలంగా మడకశిర నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కి మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. నియోజకవర్గం లో ఎవరికీ వారే అన్నట్టు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎస్సీ నియోజక వర్గమైన మడకశిరలో గుండుమల తిప్పేస్వామి ప్రభావం కూడా బాగా కనిపిస్తోంది. అదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు కూడా మంచి పట్టు ఉంది. ఈ ఇద్దరి మధ్య వర్గ విభేదాలతో ఈరన్న కొడుకు డాక్టర్ సునీల్ కు తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించడంతో గుండుమల తిప్పేస్వామి వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
గుండుమల తిప్పేస్వామి వర్గానికి టికెట్ ఇస్తే నియోజకవర్గం లో అభ్యర్థిని గెలిపించుకొని వస్తామని గతంలో కూడా చంద్రబాబు ముందు మడకశిర పంచాయతీ జరిగింది. చంద్రబాబు ఈ విషయాన్ని సున్నితంగా తిరస్కరించి మాజీ ఎమ్మెల్యే ఈరన్న కొడుకే టికెట్ కేటాయించారు. దీంతో గుండుమల తిప్పేస్వామి వర్గం టికెట్ ప్రకటించిన వారం రోజుల తర్వాత కాక మరింత పెరగడం గమనార్హం. దీనిని చంద్రబాబు పరిష్కరించాలని ఇరు వర్గాలుకోరుతున్నాయి. అయితే.. సునీల్ మాత్రం తానే పోటీ చేస్తానని అంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు టీడీపీకి ఇబ్బందిగా మారిందనే వాదన వినిపిస్తోంది.