Begin typing your search above and press return to search.

అయోధ్య రామాలయానికి యాచకుల విరాళం..ఎంతంటే?

దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయం మరికొద్ది రోజుల్లో భక్తులకు అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Dec 2023 6:14 AM GMT
అయోధ్య రామాలయానికి యాచకుల విరాళం..ఎంతంటే?
X

దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయం మరికొద్ది రోజుల్లో భక్తులకు అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. రాములోరి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహుర్తాన్ని నిర్ణయించి.. ఆ దిశగా ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అయోధ్య రామాలయ నిర్మాణానికి ధనిక.. పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ వంతు విరాళాల్ని అందించిన పరిస్థితి. తాజాగా ఆ జాబితాలోకి చేరారు కాశీలో జీవనం సాగించే యాచకులు. వారు సైతం అయోధ్య రామాలయానికి తమ వంతు విరాళాల్ని రామాలయ ట్రస్టుకు అందించారు.

రామాలయానికి ఎవరికి వారు.. తమకు తోచినంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలంటూ ఆర్ఎస్ఎస్ సమర్పణ్ నిధి ప్రచారంలో భాగంగా కాశీకి చెందిన భిక్షగాళ్లు తమలో తాము విరాళాలు సేకరించారు. గత నవంబరులో కాశీలో భిక్షాటన చేస్తున్న కొందరు వ్యక్తులు కాశీలోని సంఘ్ పరివార్ కార్యాలయానికి వెళ్లి.. రామాలయ నిర్మాణంలో తాము కూడా భాగస్వాములం అవుతామని.. తాము అందించే విరాళాన్ని స్వీకరించాలనికోరారు. ఇందుకు వారు సమ్మతించారు.

దీంతో ఉత్తరప్రదేశ్ లోని 27 జిల్లాలకు చెందిన యాచకులు రామ మందిర నిర్మాణం కోసం విరాళాల్ని సేకరించారు. రూ.4.5 లక్షల మొత్తాన్నిసేకరించారు. అయోధ్యలో నిర్మించే రామాలయంలో తమ భాగస్వామ్యం కూడా ఉండాలన్న ఉద్దేశంతో యాచకులమంతా కలిసి విరాళాలు సేకరించామని.. ఆ మొత్తాన్ని ఆలయ కమిటీకి అందజేసినట్లుగా పేర్కొన్నారు. జనవరి 22న జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

రామాలయ నిర్మాణానికి విరాళం ఇచ్చేందుకు నాలుగు వేలకు పైగా చెప్పులు కుట్టేవారు.. స్వీపర్లు.. చాకలివారు సైతం తమ కష్ఠార్జితంలో కొంత భాగాన్ని రామాలయ నిర్మాణం కోసం విరాళాల రూపంలో ఇవ్వటం చూసినప్పుడు.. వారు.. వీరు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు రామాలయంలో తమ భాగస్వామ్యం ఉండాలన్న తపన కనిపిస్తుందని చెప్పాలి.