Begin typing your search above and press return to search.

చంద్రబాబు ధీమా వెనక...!?

ఇక విశాఖలో బుధవారం రాత్రి గడపిన చంద్రబాబు గురువారం విజయవాడకు బయల్దేరి వెళ్లారు.

By:  Tupaki Desk   |   21 Dec 2023 9:20 AM GMT
చంద్రబాబు  ధీమా వెనక...!?
X

ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ప్రజలు కచ్చితంగా టీడీపీని గెలిపిస్తారు అని ఆయన ధీమగా ఉన్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన యువగళం ముగింపు సభకు జనాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సభలోనే చంద్రబాబు వైసీపీ ఓటమి ఖాయం అయిపోయింది అనేశారు. ఇక వచ్చేది టీడీపీయే అన్నారు.

ఇక విశాఖలో బుధవారం రాత్రి గడపిన చంద్రబాబు గురువారం విజయవాడకు బయల్దేరి వెళ్లారు. ఈలోగా ఆయన ట్విట్టర్ ద్వారా సందేశం పంపించారు. యువగళం సూపర్ సక్సెస్ వెనక ప్రజల ఆకాంక్షలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఏపీలో ఈసారి వచ్చేది టీడీపీ జనసేన కూటమే అని కూడా బల్ల గుద్దుతున్నారు.

మరి చంద్రబాబు ధీమా వెనక కారణం ఏంటి అన్న చర్చ సాగుతోంది. ఏపీలో చూస్తే 2014 నుంచి ప్రతీ అయిదేళ్లకు ప్రభుత్వం మారుతోంది. అది ఒక అంచనా అని అంటున్నారు. అలా చంద్రబాబు 2019లో అధికారాన్ని కోల్పోయారు. కాబట్టి 2024 నాటికి తన కుర్చీని జగన్ ఖాళీ చేసి ఇస్తారని బాబు లెక్క వేసుకుంటున్నారు.

ఇక ఏపీలో అభివృద్ధి లేదు అని టీడీపీ అంటోంది. ముఖ్యంగా రాజధాని లేదు అని కూడా గట్టిగా చెబుతోంది. ఇక యువగళం సభలో చంద్రబాబు జగన్ మీద చాలా విమర్శలు చేశారు. ఏపీని ముప్పయ్యేళ్ళ పాటు వెనక్కి నడిపించింది వైసీపీ ప్రభుత్వం అని కూడా అన్నారు. దాంతో ఏపీలో జనాలు ప్రగతి దిశగా అడుగులు వేస్తారని, దాని ఫలితం తమకు అనుకూలం అవుతుందని కూడా టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది.

మరో కారణం ఎంటి అంటే జనసేనతో పొత్తు. జనసేన వేరేగా పోటీ చేయబట్టే 2019లో దాదాపుగా నలభై సీట్లకు పైగా ఓట్లకు చిల్లుపడి ఓటమి ఎదురైంది అని కూడా టీడీపీ విశ్లేషించుకుంటోంది. ఇపుడు జనసేనతో పొత్తు వల్ల ఆ సీట్లు పదిలంగా ఉంటాయని ఇక వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత గత అయిదేళ్లలో ఎక్కువగా ఉంది కాబట్టి అలా మరో ఇరవై నుంచి ముప్పయి సీట్లు రావచ్చు అని లెక్క వేస్తోంది. ఇవన్నీ కలిపితే సులువుగా మ్యాజిక్ ఫిగర్ కి రీచ్ అవుతామని అంటోంది.

ఇక ఎపుడైతే ఒక పార్టీ అధికారంలోకి వస్తోంది అన్న అంచనాలు మొదలవుతాయో తటస్థులతో పాటు మిగిలిన సెక్షన్లు కూడా తమ వైపు ఉంటాయని ఆ విధంగా ఆయా వర్గాలు కదిలి కూటమికి జై కొడితే కచ్చితంగా మరో ముప్పయి సీట్లు గెలుచుకోవచ్చు అని కూడా అంచనా కడుతోంది. ఇలా ఏ విధంగా చూసుకున్నా నూటా ఇరవైకి పైదాటి సీట్లు వస్తాయని ఈ రోజుకు అయితే టీడీపీ లెక్క ఉంది.

ఇది ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో వైసీపీలో పెరిగిన అసంతృప్తి అక్కడ టికెట్లు దక్కని వారు అంతా కలసి తమతో కలసినా వేరుగా ఉన్నా కూడా తమకే చివరికి లాభం అని అంటోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు యువత నిరుద్యోగులతో పాటు వివిధ వర్గాలు కూడా ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కలసి కచ్చితంగా 2019లో వైసీపీకి వచ్చినట్లుగానే 151 సీట్లు ఈసారి తమ కూటం పరం అవుతాయని కూడా ఆ పార్టీ భావిస్తోంది.

అందుకే చంద్రబాబు యువగళం సభలో ఫుల్ రిలాక్స్డ్ మూడ్ లో కనిపించారు అని అంటున్నారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో యువతరం ఏపీలో మార్పుని కోరుకుంటోంది అని పేర్కొన్నారు. అంతే కాదు ఏపీ ప్రజలు మార్పు కోసం తహతహలాడుతున్నారు అని బాబు చెప్పుకొచ్చారు. టీడీపీ జనసేన కూటమి పట్ల ప్రజలు విశ్వాసం ప్రకటించారని కూడా బాబు అంటున్నారు. మరి బాబు ధీమా నిజం అవుతుందా లేదా అన్నది తేల్చేది ఎన్నికలే.