Begin typing your search above and press return to search.

వీడియో : బెజవాడ బస్టాండ్ లో దారుణం

విజయవాడ బస్టాండ్ లో అదుపు తప్పిన మెట్రో లగ్జరీ ఏసీ బస్సు ప్లాట్ ఫాం మీదకు దూసుకెళ్లటంతో అక్కడే వెయిట్ చేస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.

By:  Tupaki Desk   |   7 Nov 2023 6:34 AM GMT
వీడియో : బెజవాడ బస్టాండ్ లో దారుణం
X

ఊరికి వెళ్లేందుకు బస్టాండ్ కోసం వచ్చిన ప్రయాణికుల్లో మూడు నిండు ప్రాణాల్ని పాడు బస్సు బలి తీసుకుంది. విజయవాడ బస్టాండ్ లో చోటు చేసుకున్న తాజా ఘోర ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ముమ్ముటికి బస్సు డ్రైవర్ తప్పుతో అదుపు తప్పిన బస్సు.. ఏకంగా ప్లాట్ ఫాం మీదకు దూసుకెళ్లటమే కాదు.. బస్సు కోసం వెయిట్ చేస్తున్న ముగ్గురిని మింగేసింది.

విజయవాడ బస్టాండ్ లో అదుపు తప్పిన మెట్రో లగ్జరీ ఏసీ బస్సు ప్లాట్ ఫాం మీదకు దూసుకెళ్లటంతో అక్కడే వెయిట్ చేస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో ఏడు నెలల చిన్నారి కూడా ఉండటం పలువురిని కలిచివేసింది. మానవ లోపమే ప్రాణాలు పోవటానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తుంటే.. సాంకేతిక లోపమని ఆర్టీసీ వర్గాలు వివరణ ఇస్తున్నాయి.

విజయవాడ - గుంటూరు మధ్య తిరిగే ఏసీ మెట్రో లగ్జరీ నాన్ స్టాప్ బస్సు విజయవాడ బస్టాండ్ లోని 11-12 ప్లాట్ ఫాం మీద ఉంది. ఆటోనగర్ కు చెందిన ఈ బస్సులో అప్పటికే 24 మంది ప్రయాణికులు ఎక్కి ఉన్నారు. బస్సు డ్రైవర్ బస్్సును రివర్సు చేసే ప్రయత్నం చేయగా.. ఒక్క ఉదుటన అడుగు ఎత్తు ఉన్న ప్లాట్ ఫాం మీదకు దూసుకెళ్లింది. దీంతో.. అక్కడున్న రెయిలింగ్ను.. స్తంభాన్ని ఢీ కొట్టి.. ప్లాట్ ఫాం మీద ప్రయాణికులు కూర్చేందుకు ఉన్న ఇనుప కుర్చీలను ఢీ కొట్టింది. ఈ వేగానికి కుర్చీలు చెల్లాచెదురయ్యాయి.

ప్లాట్ ఫాం కుర్చీలో కూర్చున్న చీరాలకు చెందిన కుమారి.. తాడేపల్లి మండలం వడ్డేశ్వరానికి చెందిన మహిళ కుమార్తె (7 నెలల చెర్రీ).. ప్రత్తిపాడు మండలం రావిపాడుకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి వీరయ్యలు బస్సు చక్రాల కింద పడి నలిగిపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి చోటుచేసుకున్న ఈ ఘటనతో బస్టాండ్ లోని వారంతా భయాందోళనలకు గురయ్యారు. జాకీల సాయంతో బస్సును కొంత పైకి లేపినా.. ఛాసిస్ బాగా కిందకు ఉండటంతో.. బస్సు కింద పడిన వారిని బయటకు తీసుకురాలేకపోయారు. దీంతో.. బస్సు రివర్సు చేయగా.. కింద పడి ప్రాణాలు కోల్పోయిన బాధితులు కనిపించారు. వీరిని చూసిన ప్రయాణికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.