సంచలన నిర్ణయం... సెక్స్ వర్కర్లకు పెన్షన్!
అయితే.. ఈ విషయంలో బెల్జియం మాత్రం ప్రపంచంలోనే మొదటిసారిగా సంచలన నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 1 Dec 2024 4:58 AM GMTభారతదేశంలో సెక్స్ వర్క్ నేరంగా పరిగణిస్తారు! సమ్మతి ఉన్న పెద్దల మధ్య శృంగారం పూర్తిగా చట్టబద్దమైనదే కానీ.. సెక్స్ వర్క్ ని మాత్రం వృత్తిగా చట్టపరమైన గుర్తింపును కలిగి లేదు! ఇదే సమయంలో సెక్స్ వర్కర్లకు ఎలాంటి హక్కులూ కల్పించబడలేదు. అయితే.. ఈ విషయంలో బెల్జియం మాత్రం ప్రపంచంలోనే మొదటిసారిగా సంచలన నిర్ణయం తీసుకుంది.
అవును... బెల్జియన్ సెక్స్ వర్కర్లు ఇకపై పెన్షన్లు, ప్రస్తూతి సెలవులను అందుకోబోతున్నారు. తాజాగా అక్కడ లైంగిక పనిని కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావడానికి అక్కడ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇదే సమయంలో కార్మికులకు అందే ప్రయోజనాలతో పాటు ఉపాధి ధృవీకరణ పత్రాన్ని సెక్స్ వర్కర్లు అందుకోనున్నారు.
వాస్తవానికి జర్మనీ, నెదర్లాండ్స్, గ్రీస్, టర్కీతో సహా అనేక దేశాల్లో సెక్స్ వర్క్ చట్టబద్ధం చేయబడింది. కానీ.. ఉపాధి హక్కులు, ఒప్పందాలను మాత్రం కల్పించలేదు. దీంతో.. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బెల్జియం... సెక్స్ వర్కర్లకు పెన్షన్, హెల్త్ ఇన్స్యూరెన్స్, ప్రసూతి సెలవులు వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించనుంది.
ఈ కొత్త చట్టం యజమానులను భద్రతా ప్రమాణాలను పాటించాలని, కస్టమర్లను తిరస్కరించే విషయంలో కార్మికుల హక్కులను గౌరవించాలని కూడా ఆదేశించింది. ఈ చర్యలు సెక్స్ వర్కర్లకు సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడంతో పాటు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన హ్యూమన్ రైట్స్ వాచ్ లో పరిశోధకురాలు ఎరిన్ కిల్ బ్రైడ్.. ఇది ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా చూడని అత్యుత్తమ దశ.. ప్రతీ దేశం ఆ దిశలో పయనించడం తమకు అవసరం అని పేర్కొన్నారు. ఇదే సమయంలో కొత్త చట్టం తమ జీవితాలను మెరుగుపరుస్తుందని స్థానిక సెక్స్ వర్కర్లు అభిప్రాయపడుతున్నారు.