ఆ గవర్నర్‌ను స్త్రీలోలుడిగా చిత్రీకరిస్తున్నారా? దేశంలో తొలి వివాదం!
కేంద్రంలోని మోడీ సర్కారుకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉంది
By: Tupaki Desk | 30 Jun 2024 1:30 AM GMTదేశంలో రాజకీయాలు వ్యూహాత్మకంగా మారుతున్నాయి. ఒకపార్టీపై మరోపార్టీ పైచేయి సాధించే క్రమంలో రాజకీయాలు దారి మళ్లుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఓ రాష్ట్ర గవర్నర్‌ను స్త్రీలోలుడిగా చిత్రీకరిస్తున్నారా? అనే సందేహాలు ముసురుకున్నాయి. రాజకీయ రణరంగంలో సదరు గవర్నర్ ఇప్పుడు అభాసుపాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 73 ఏళ్ల వయసున్న ఆ గవర్నర్‌ను కలుసుకునేందుకు.. మహిళా ఎమ్మెల్యేలు దూరంగా ఉండడం.. రాజకీయంగా ఆయనపై విమర్శలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అంతేకాదు.. ప్రస్తుతం ఎదురైన వివాదం దేశంలోనే తొలిది కావడం గమనార్హం.
ఎవరు? ఎక్కడ?
కేంద్రంలోని మోడీ సర్కారుకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉంది. దీంతో కేంద్రంపై పట్టు పెంచుకోవాలని.. మమత, ఆమెపై పైచేయి సాధించాలని కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా.. పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న వ్యవహారం కూడా.. గత దశాబ్ద కాలంగా కనిపిస్తూనే ఉంది. ఈ రగడ.. గతంలోనూ.. ఇప్పుడు కూడా.. రాజభవన్ కేంద్రంగా సాగుతున్నదే. గతంలో గవర్నర్‌గా ఉన్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ నుంచి ప్రస్తుత గవర్నర్ సీవీ ఆనందబోస్ వరకు.. కూడా వివాదాలతోనే మమత వర్సెస్ రాజభవన్ కాలం వెళ్ల దీస్తున్నాయి.
ప్రస్తుతం గవర్నర్‌గా ఉన్న సీవీ ఆనంద బోస్... మమతా బెనర్జీ ప్రభుత్వం స్త్రీలోలుడిగా ముద్ర వేస్తోంది. ఆయనకు మహిళలంటే పిచ్చి అని .. ఎవరిని చూసినా వదలరని.. రాజ్‌భవన్ కేంద్రంగా రాసలీలలు చేస్తున్నారని మమతా బెనర్జీ స్వయంగా చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం రేపుతున్నాయి. మే 2 వతేదీన.. గవర్నర్ కార్యాలయంలో పనిచేసే ఓ మహిళ.. తనపై గవర్నర్ అఘాయిత్యానికి ప్రయత్నించారంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన దరిమిలా.. ఈ వివాదం రావణకాష్టంగా రగులుతూనే ఉంది. నేరుగా సీఎం మమతే.. గవర్నర్‌పై నోరు చేసుకున్నారు. రాజ్‌భవన్ వైపు చూడాలంటేనే రాష్ట్రంలోని మహిళలు భయపడి పోతున్నారంటూ.. ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు.. స్త్రీలోలుడు అని నేరుగా వ్యాఖ్యానించారు.
ఇంకా చిత్రం ఏంటంటే..
మరో చిత్రమైన వ్యవహారం ఏంటంటే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. ఆ రెండు స్థానాల్లో ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా విజయం దక్కించుకున్నారు. అనంతరం.. వారు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ.. ఇప్పటి వరకు వారు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చి.. దాదాపు నెల అవుతున్నా.. వారు ప్రమాణం చేయకపోవడం గమనార్హం. దీనికి కారణం.. గవర్నరేనని అంటున్నారు. తాము రాజ్‌భవన్‌కు వెళ్లబోమని.. అటు వైపు చూస్తుంటేనే తమ కు భయం వేస్తోందని వారు చెబుతున్నారు. గవర్నర్ అసెంబ్లీకి వచ్చి తమతో ప్రమాణ స్వీకారం చేయించాలని కోరుతున్నారు. ఇది మరో వివాదంగా మారింది. దీంతో తాజాగా గవర్నర్ ఆనంద్.. సీఎంపై పరువు నష్టం దావా వేయడం గమనార్హ.
ఎవరీ ఆనంద బోస్?
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న బోస్.. 1977 నాటి ఐఏఎస్ అధికారి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కలెక్టర్‌గా పనిచేశారు. కేంద్ర సర్వీసుల్లోనూ పనిచేశారు.కేరళకు చెందిన ఆయన తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఆరోపణలు లేకుండా జీవించడం విశేషం. అంతేకాదు.. అంత బిజీగా ఉన్న ఆయన 350 రచనలు చేశారు. 70 పుస్తకాలు రాశారు. ఆయన రాసిన సామాజిక ఉద్యమ పుస్తకాలు.. వివిధ ప్రపంచ భాషల్లో ప్రచురితమయ్యారు. ప్రస్తుతం ఆయన వయసు 73 ఏళ్లు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి వివాహాలు అయిపోయాయి. ఇదీ..సంగతి!!