రూ.50 కోట్లు కట్నం అడిగిన ఎయిమ్స్ టాపర్?... తెరపైకి తెలుగు సమాజం టాపిక్!
ఓ టాపర్.. రూ.50 కోట్ల కట్నం డిమాండ్ చేయడంతో తన స్నేహితురాలి గుండె పగిలిపోయిందని బెంగళూరుకు చెందిన ఓ మహిళా డాక్టర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.
By: Tupaki Desk | 30 Oct 2024 6:52 AM GMTఆడపిల్లను ఎంతో అపురూపంగా పెంచుకున్న తల్లితండ్రులు.. ఎంతో డబ్బు దారపోసి ఉన్నత చదువులు చదివించి, ఆమె కాళ్లపై ఆమె నిలబడేలా చేసినా కూడా.. తిరిగి ఆమెకు పెళ్లి చేసే సమయానికి మరో భారీ భారం వచ్చి పడుతుంది! అదే... "కట్నం" అనే మహమ్మారి! తాజాగా ఈ విషయంలో ఓ వైద్యురాలి పరిస్థితిని తన స్నేహితులొకరు ఆన్ లైన్ వేదికగా పంచుకున్నారు.
అవును... తమలపాకులో పెట్టి తాంబూలం అన్నా.. డిమాండ్ మీద ఇవ్వాల్సి వచ్చిన బహుమతి / కానుక అని కవర్ చేసినా.. వరకట్న సమస్య మాత్రం భారతదేశాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. దౌర్భాగ్యకరమైన విషయం ఏమిటంటే... ఉన్నత చదువులు చదువుకున్నవారు, సమాజంలో గొప్ప గొప్ప స్థానాలో ఉన్నవారు సైతం ఇలాంటి పనులకు పాల్పడుతున్నే ఉన్నారు.
ఈ సమయంలో... ఆల్ ఇండియా ఇనిస్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి చెందిన ఓ టాపర్.. రూ.50 కోట్ల కట్నం డిమాండ్ చేయడంతో తన స్నేహితురాలి గుండె పగిలిపోయిందని బెంగళూరుకు చెందిన ఓ మహిళా డాక్టర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. ఈ విషయమై తన స్నేహితురాలు ఆవేదనంతో తనతో పంచుకుందని వెల్లడించింది!
ఈ క్రమంలో... ఎయిమ్స్ ఎంట్రన్స్ లో టాప్ ర్యాంక్ సాధించిన ఓ వ్యక్తితో తన స్నేహితురాలు వివాహ ప్రతిపాదన కోసం చూస్తున్నట్లు సదరు మహిళా డాక్టర్ చెప్పారు. తన స్నేహితురాలు కూడా వైద్యురాలే అని.. ఆమె ప్రస్తుతం అనస్థీషియాలో ఎండీ చదువుతున్నారని.. హైదరాబాద్ లో లివర్ మార్పిడి అనస్థీషియాలో ఫెలోషిప్ తో మరింత నైపుణ్యం పొందుతున్నారని తెలిపారు.
ఈ క్రమంలో తోటి డాక్టర్ ను పెళ్లి చేసుకునేందుకు ఎయిమ్స్ టాప్ ర్యాంకర్ ఒకరు రూ.50 కోట్లు డిమాండ్ చేయడమా అని నిలదీశారు. ఈ సమయంలో... రూ.50 కోట్లు అంటే తన తల్లితండ్రులు జీవితమంతా పోదుపుచేసిన మొత్తం అవుతుందని ఆమె స్నేహితురాలు గంటల తరబడి ఏడుస్తూనే ఉందని.. తర్వాత ఆమె చెల్లి భవిష్యత్తు ఏమిటని ఆవేదన వ్యక్తం చేసిందని తెలిపారు.
ఇదే సమయంలో.. తెలుగు సమాజంలో ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే భారీగా కట్నం అవసరమనే విషయాన్ని తన స్నేహితురాలి తల్లితండ్రులు అంగీకరించారని ఆమె వెల్లడించారు! ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సమయంలో.. సదరు టాపర్ తీరును నెటిజన్లు తప్పు పడుతున్నారు. ఒక వైద్యుడు తన కాళ్లపై తాను నిలబడే దమ్ము లేని ఈ విద్య ఎందుకంటూ కామెంట్లు చేస్తున్నారు!