బెంగళూరులో జుట్టు దొంగలు.. కోటి సరుకుతో జంప్!
దొంగతనానికి కాదేదీ అనర్హం అన్నట్టుగా కొందరు దొంగలు విచిత్రమైన వస్తువులను ఎత్తుకెళ్తుంటారు.
By: Tupaki Desk | 6 March 2025 3:15 PM ISTదొంగతనానికి కాదేదీ అనర్హం అన్నట్టుగా కొందరు దొంగలు విచిత్రమైన వస్తువులను ఎత్తుకెళ్తుంటారు. కొందరికి హోటళ్లలో స్పూన్లు ఎత్తుకురావడం సరదా. ఇక కొందరు ఆడవాళ్లకైతే బట్టల షాపుల్లోకి వెళ్లి చీరలు దొంగతనం చేస్తుంటారు. నాలుగురైదుగురు గుంపుగా వెళ్లి షాపు వాడిని బురిడి కొట్టిస్తారు. ఇక కొందరు దొంగలుంటారు. గుళ్ల ముందు విడిచిన చెప్పులను సైతం దొంగతనం చేస్తుంటారు. దొంగల్లో ఇలా నానా రకాల వెరైటీ దొంగలు ఉంటారు. ఒక్కొక్కసారి వారు చేసే దొంగతనాలు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అప్పట్లో ఓ వైన్ షాపులో దొంగతనానికి వెళ్లిన దొంగ.. డబ్బులను ఎత్తుకెళ్దామని వచ్చి షాపులో ఫ్రీగా వచ్చింది కదా అని మందును ఫుల్లుగా తాగేశాడు. ఇంకేముంది ఆ షాపులోనే నిద్రలోకి జారుకుని గుర్రుపెట్టి పడుకున్నాడు. తీరా ఉదయం షాపు ఓనర్ వచ్చి పోలీసులకు పట్టించాడు.
ఇలా వెరైటీ దొంగతనాలు కోకొల్లలు. తాజాగా బెంగళూరులో ఓ వింత దొంగతనం జరిగింది. కొందరు దొంగలు జుట్టును కాజేశారు. అయితే ఈ దొంగతనం కామెడీని తెప్పించినా..దీని విలువ మాత్రం అక్షరాల కోటి రూపాయలు. అంటే కాస్ట్ లీ దొంగతనమే అన్నమాట. అసలు ఈ దొంగలకు జుట్టును చోరీ చేయాల్సిన ఆఘాయిత్యం ఎందుకు వచ్చిందో ఘటన లోతుల్లోకి వెళ్దాం..
బెంగళూరు లక్ష్మీపూర్ క్రాస్ లోని ఓ గోదాములో విగ్గుల తయారీకి ఉపయోగించే జుట్టును నిల్వ ఉంచుతారు. వీటిని చైనా, బర్మా, హాంకాంగ్ కు ఎగుమతి చేస్తుంటారు. ఈక్రమంలోనే ఆరుగురు దుండగులు వాహనంలో వచ్చి గోదాములోని జుట్టుతో పరారయ్యారు. దీని విలువ 90 లక్షలకు పైమాటే. ఈ ఘటన ఫిబ్రవరి 28న జరగ్గా..లేటుగా బయటకు వచ్చింది. గోదాము యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేసి విచారిస్తున్నారు.
విగ్గుల తయారీ కోసం జట్టును కొనుగోలు చేసేందుకు ఈమధ్యనే కొందరు గోదాముకు వచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ ఘటన జరిగిందని ఓనర్ చెప్పడంతో.. తెలిసిన వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.
ఆడవాళ్ల దువ్వుకోగా ఊడిపోయిన చిక్కు వెంట్రుకలకు బోళ్లు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. వెంట్రుకలకు బోళ్లు ఇవ్వడమేంటో అనుకుంటాం. కానీ ఆ వెంట్రుకలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. ఆడవాళ్లకు వాటిని కొనేవాళ్లు తెలివిగా.. తేలిగ్గా.. బోళ్లు అప్పజెప్పుతారు కానీ ఆ వెంట్రుకలు తులం వందల్లో ఉంటుందట. కిలో వేలు, లక్షల్లో ఉంటుందట. ఆడవాళ్ల జుట్టుకు ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉంది కనుకనే బెంగళూరు దొంగల కన్ను జుట్టుపైన పడిందని నవ్వుకుంటున్నారు నెటిజన్లు.