కూతుర్ని ప్రేమించాడని కాళ్లు చేతులు కట్టేసి నిప్పు అంటించాడు
కారులో వచ్చిన అమ్మాయి తండ్రి.. అతడ్ని బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకొని తీసుకెళ్లారు.
By: Tupaki Desk | 17 July 2023 4:31 AM GMTగార్డెన్ సిటీలో ఘోరం చోటు చేసుకుంది. దేశంలోని కాస్మోపాలిటిన్ కల్చర్ ఎక్కువగా ఉంటుందని చెప్పే బెంగళూరులో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. తన కుమార్తెను ప్రేమించాడన్న కోపంతో.. ఒక యువకుడ్ని సజీవ దహనానికి పాల్పడిన ఉదంతం షాకింగ్ గా మారింది. బెంగళూరుకు చెందిన ఆర్ఆర్ నగర ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల మనసు కాలేజీ విద్యార్థి.
తమ కాలేజీలో చదువుతున్న సహ విద్యార్థినిని లవ్ చేశాడు. పెద్దలకు చెప్పి.. వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇందులో భాగంగా పెద్దవాళ్లకు చెప్పగా.. వారు ససేమిరా అన్నారు. దీంతో.. పట్టువదలని ఆ కుర్రాడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు.
దీని పై ఆగ్రహానికి గురైన అమ్మాయి తండ్రి.. తమ బంధువులను.. స్నేహితుల్ని వెంట పెట్టుకొని వచ్చి మరీ.. మను ఇంటిపై దాడి చేసి ఆమెను తమ వెంట తీసుకెళ్లారు.
ఆ తర్వాత ఎప్పలానే కాలేజీకి వెళ్లేందుకు ఇంటి వద్ద ఉన్న బస్టాండ్ దగ్గర మను నిలుచొని ఉండగా.. కారులో వచ్చిన అమ్మాయి తండ్రి.. అతడ్ని బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకొని తీసుకెళ్లారు. నగర శివారులోకి తీసుకెళ్లి.. మను చేతులు.. కాళ్లు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.
చుట్టుపక్కల వారు ఈ దారుణాన్ని గమనించి.. అడ్డుకునే ప్రయత్నం చేసి.. అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే తీవ్రంగా కాలిన మనుకు చికిత్స చేశారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే అతను కన్నుమూశాడు. ఈ ఉదంతంలో అమ్మాయి తండ్రి రంగనాథ్.. అతడి బంధువులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది.