బెంగళూరులో నీటి కటకటకు ఈ జరిమానాలే ఉదాహరణ!
ఈ క్రమంలో బెంగళూరు వాసులకు మాత్రం ఈ ఏడాది నీటి విలువ ఇంకాస్త ఎక్కువగానే తెలిసిందని భావించొచ్చు!
By: Tupaki Desk | 25 March 2024 3:19 PM GMTమనిషి మనుగడకు నీరు ఎంత అవసరం.. నీటిని ఎంత పొదుపుగా వాడాలి.. మొదలైన విషయాలు ప్రతీ ఎండాకాలం చాలా మందికి తెలిసివస్తుంటుంది. మళ్లీ ఎండాకాలం వెళ్లగానే.. నాలుగు చినికుల వర్షం పడగానే అవన్నీ మరిచిపోతుంటారు.. భూగర్భ జలాలు అడుగంటకుండా వర్షపు నీటిని వొడిసిపట్టుకోవాలనే ఆలోచనలను పక్కనపడేస్తుంటారు. ఈ క్రమంలో బెంగళూరు వాసులకు మాత్రం ఈ ఏడాది నీటి విలువ ఇంకాస్త ఎక్కువగానే తెలిసిందని భావించొచ్చు!
అవును... ఇంకా పూర్తిస్థాయిలో ఎండాకాలం రాకముందే, ఎండలు విపరీతంగా వేడెక్కకముందే, రోహిణీ కార్తీ ఎంటరవ్వకముందే కర్ణాటక రాజధాని బెంగళూరు నగర వాసులు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి, డిప్యూటీ సీఎం ఇంటికి సైతం నీటి కటకటా వచ్చిందనే వార్తలు ఇటీవల వైరల్ గా మారిన పరిస్థితి.
ఈ నేపథ్యంలో నీటిని పొదుపు చేసేందుకు అధికారులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాగునీరుని వృథాచేసే వరిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నీటి వృథాపై సోషల్ మీడియాల్లో పలు ఫిర్యాదులు రావడంతో వాటిపై చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో... తమ ఆదేశాలు ఉల్లంఘించి, మంచి నీటిని వృథా చేసినందుకు గానూ సుమారు 22 కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికీ రూ.5వేల చొప్పున జరిమానా విధించారు.
ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ విషయాలపై స్పందించిన బెంగళురు వాటర్ బోర్డు అధికారులు... తాగునీటిని గార్డెనింగ్, కార్ వాషింగ్ వంటి అవసరాలకు వాడినందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 22 కుటుంబాల నుంచి మొత్తం రూ.1.1 లక్షల మేర జరిమానాగా వసూల్ చేసినట్లు వెల్లడించారు. ఇందులో ప్రధానంగా దక్షిణ ప్రాంతం నుంచే రూ.80 వేలు జరిమానాగా వసూలు చేసినట్లు తెలిపారు.
ఇదే క్రమంలో ఇలాంటి విషయాలపై మరిన్ని సూచనలు, హెచ్చరికలు చేసిన నీటి సరఫరా బోర్డు... నగరంలో నీటి కటకటను అర్ధంచేసుకుని తాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా కార్లు, బైక్ లు కడగడం.. ఎంటర్ టైన్ మెంట్ సంబంధిత కార్యక్రమాలు, నిర్మాణాలు వంటి వాటికొసం తాగునీరు వాడొద్దని కోరింది. ఆదేశాలను ధిక్కరిస్తే మొదటి సారి జరిమానా.. అనంతరం ఆ జరిమానాను ప్రతిసారీ రూ.500 అదనంగా పెంచుతూ పోతామని వెల్లడించింది.