Begin typing your search above and press return to search.

ఉగ్రవాదులతో లింకు.. ఏపీ టెకీ అరెస్టు!

ఇటీవల బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ లో బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు

By:  Tupaki Desk   |   21 May 2024 10:31 AM GMT
ఉగ్రవాదులతో లింకు.. ఏపీ టెకీ అరెస్టు!
X

ఇటీవల బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ లో బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. బ్యాగ్‌ తగిలించుకుని, టోపీ పెట్టుకుని వచ్చిన ఓ వ్యక్తి కేఫ్‌ లో ఓ మూలన బాంబు పెట్టాడు. ఈ ఘటనపై జాతీయ దర్యాపు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో పలువురిని అరెస్టు చేసింది. వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తేలింది.

కాగా రామేశ్వరం కేఫ్‌ ఘటనకు సంబంధించే ఆంధ్రప్రదేశ్‌ లోని అనంతపురం జిల్లా టెకీని నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బాంబు పేలుడు ఘటన జరిగినప్పటి నుంచి ఎన్‌ఐఏ అధికారులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అనుమానితుల కదలికలపై దృష్టి సారించారు. పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో అనంతపురంలో ఓ టెకీకి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. తాజాగా అతడిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన సోహెల్‌ అనే వ్యక్తి బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు అనుమానం. అంతేకాకుండా అతడి బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తం డబ్బు జమైందని సమాచారం.

ఈ క్రమంలో అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఆత్మకూర్‌ వీధిలో ఉన్న సోహెల్‌ ఇంటిపై ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేశారు. సోహెల్, అతని తండ్రి అబ్దుల్, ఇతర కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు.

ఇటీవల సోహెల్‌ బ్యాంకు ఖాతాలోకి పెద్ద మొత్తం ఎలా వచ్చిందనే విషయాన్ని సోహెల్‌ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం సోహెల్‌ ను అదుపులోకి తీసుకున్న అధికారులు రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌కు అతడిని తరలించారు.

ప్రస్తుతం సోహెల్‌ కు ఉగ్రవాదులతో సంబంధాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.