Begin typing your search above and press return to search.

అటు బంగ్లా.. ఇటు బెంగాల్.. అడకత్తెరలో హిందూ శరణార్థులు!

అయితే.. మతపరంగా వారు మైనారిటీలు. బంగ్లా రాజకీయ అస్థిరత ఇప్పుడు వారిని కల్లోలపరుస్తోంది.

By:  Tupaki Desk   |   10 Aug 2024 12:15 PM GMT
అటు బంగ్లా.. ఇటు బెంగాల్.. అడకత్తెరలో హిందూ శరణార్థులు!
X

1905కు ముందువరకు అదంతా ఒకే ప్రాంతం.. అసలు వాటి మధ్య విభజన రేఖనే లేదు. కానీ, కర్జన్ గీసిన ఆ రేఖ శాశ్వతంగా వేరు చేసింది.. 1947 నాటికి రెండు ముక్కలు చేసింది. 1971 నాటికి అది మరో స్వతంత్ర దేశంగా ఏర్పడింది.. ఇదీ ఒకనాటి బెంగాల్ లో భాగమై.. తర్వాత తూర్పు బెంగాల్, తూర్పు పాకిస్థాన్ గా మారి చివరకు బంగ్లాదేశ్ గా స్థిరపడిన బంగ్లాదేశ్ కథ. బెంగాలీ భాష మాట్లాడే ప్రజలు కావడంతో.. పొరుగునున్న పశ్చిమ బెంగాల్ తో అన్ని విధాల సంబంధాలు ఉండడం సహజం. ఇక బంగ్లాదేశ్ ఒకప్పుడు భారత్ లోదే కాబట్టి.. అక్కడ హిందువుల సంఖ్య గణనీయమే. అయితే.. మతపరంగా వారు మైనారిటీలు. బంగ్లా రాజకీయ అస్థిరత ఇప్పుడు వారిని కల్లోలపరుస్తోంది. సామాజిక వాతావరణాన్ని దెబ్బతీసే పరిస్థితుల్లో గతం నెమరవేసుకుంటున్నారు.

బంగ్లాలో అల బెంగాల్ లో తుఫాను

బంగ్లాదేశ్ లో ఏం జరిగినా.. పొరుగున ఉండే పశ్చిమ బెంగాల్ కు ఆ ప్రభావం గట్టిగా ఉంటుంది. 1971లో బంగ్లా (అప్పటి తూర్పు పాకిస్థాన్) నుంచి లక్షల మంది వలస రావడంతో భారత్ ప్రధాని ఇందిరాగాంధీ జోక్యం చేసుకున్నారు. బెంగాల్ కే కాక బంగ్లా వలసలు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, త్రిపురలకూ తలనొప్పిగానే మారాయి. ఈ రాష్ట్రాలకు వలస వచ్చిన బంగ్లాదేశీలు ఇప్పటికీ శరణార్థుల ముద్రతోనే ఉన్నారు. అయితే, ఇది మతకోణంలోనూ కాస్త సున్నిత అంశం. ఎందుకంటే.. వలస వచ్చినవారిలో ముస్లింలు అధికం అనే ఆరోపణలున్నాయి. ఇక హిందువుల సంగతే తీసుకుంటే.. వీరికి పౌరసత్వం ఇవ్వడం ప్రధానం కానుంది. కాగా, రాజకీయంగా బంగ్లాదేశ్ మళ్లీ అశాంతిని ఎదుర్కొంటోంది. అక్కడి మైనారిటీ వర్గాలు అభద్రతాభావంతో ఉన్నాయి. దీంతో బెంగాలీ హిందువులు పొరుగు దేశంలోని మైనారిటీల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

53 ఏళ్ల కిందటి ఆ గాయాలు..


1971లో బంగ్లా దేశంగా ఏర్పడడానికి ముందు.. మన దేశంలోకి వచ్చిన హిందువుల్లో సుశీల్ గంగోపాధ్యాయ ఒకరు. బంగ్లాలోని నోఖాలీ జిల్లా వీరి కుటుంబ సొంతప్రాంతం. "మాది చాలా పెద్ద కుటుంబం. భూములు భారీగా ఉండేవి. బంగ్లా విముక్తి యుద్ధంలో పాక్ సైన్యం, రజాకార్ల దాడిలో అంతా పోయింది. మా వాళ్లు దారుణ హత్యకు గురయ్యారు. అక్కడివారికి స్వాతంత్ర్యం వచ్చినా.. నేను మాత్రం చాలా కోల్పోయాను. ఆ దేశంలో ఉండలేక భారత్ లో స్థిరపడ్డాను’’ అని చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్ లో తాజా ఘటనలను చెబుతూ అతడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. గర్భిణి పొట్టపై తన్నిన దృశ్యాలు చూసి కలత చెందినట్లు చెప్పాడు. భారతీయుడిగా తాను వారిని రక్షించాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పాడు. మరీ ముఖ్యంగా బంగ్లాలో హిందువుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. 'క్విట్ ఇండియా' ఉద్యమాన్ని పరిగణించవలసి ఉంటుంది. 1971 నాటికి తనకు 10 లేదా 12 ఏళ్లు ఉంటాయని.. రజాకార్లు తమను హింసించారని.. పురుషులను చంపి శరీరాలను నదుల్లో విసిరేశారని.. మహిళలపై అత్యాచారాలు చేశారని తెలిపాడు. ఇప్పటికీ ఆ దురాగతాలు కళ్లెదుటే కనిపిస్తున్నట్లు చెప్పాడు.


బంగావ్‌ కు చెందిన అనిమా దాస్ మాట్లాడుతూ..తమవి అత్యంత బాధాకరమైన రోజులని చెప్పారు. "అప్పటికి నాకు ఒక కొడుకు. చాలా చిన్నవాడు. కడుపులో కూతురు ఉంది. బంగ్లా అంతా ఘర్షణలు. ఇళ్ల దహనం.. మా అత్తగారు మమ్మల్ని భారత్ కు పంపేశారు. ఆ హింస తాలూకు ప్రభావం నాపై చెరగని ముద్ర వేసింది. నేను మళ్లీ బంగ్లాకు చాలాసార్లు వెళ్లా. కానీ అక్కడ ఉండాలనే ఆలోచనే రాలేదు’’ అని వివరించింది.

చాలామందిది ఇదే గాథ..

వీరిద్దరిదే కాదు.. బంగ్లా సరిహద్దు ప్రాంతాలకు చెందిన పలువురి ఇదే భావన. వీరంతా మతపరమైన హింసతో బంగ్లాలోని పూర్వీకుల ఇళ్లు, జ్ఞాపకాలను విడవలేక విడిచిపెట్టారు. భారత్ లో భద్రంగా ఉన్నామని.. ఈ దేశం అంటే కృతజ్ఞతా భావం ఉందని వివరిస్తున్నారు. అంతేకాదు.. బంగ్లాదేశ్‌ లోని హిందువులను భారత్ కు వచ్చేయండి అని సూచిస్తున్నారు.


హరధన్ బిశ్వాస్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. హింస మళ్లీ మొదలైందని.. అది హిందూ సమాజాన్ని నిరంతరం భయపెడుతూనే ఉంటుందని వాపోయారు. 1947లో స్వాతంత్ర్యం పొందినపుడు, 1971లో విముక్తి యుద్ధం సమయంలో... ఇలా అనేక సార్లు హిందువులు లక్ష్యంగా మారినట్లు తెలిపారు. "నా కళ్ల ముందే మా తాతయ్యను నరికి చంపారు. భయంతో మా భూమిని వదిలేశాం. సోదరుడి దాడి చేశారు. ప్రస్తుతం భారత్ లో ప్రశాంతంగా ఉన్నాం. అయితే, నోఖాలీలో ఉన్న మా బంధువులు బెదిరింపులకు గురవుతున్నారు. నెల రోజుల క్రితం భూ తగాదాల్లో మా మామయ్య హత్యకు గురయ్యాడు’’ అని 1956లో భారత్ కు వచ్చేసిన పరేష్ దాస్ కోరాడు.


రషోమోయ్ బిస్వాస్ అనే వ్యక్తి 1971 తర్వాత జరిగిన వేధింపులను వివరించాడు. "బంగ్లాలో హిందువుగా ఉండటం నేరం. స్వాతంత్య్రం వచ్చాక కూడా ఉపశమనం లేదు. పాకిస్తాన్ సైన్యం, జమాత్ బలగాలు మమ్మల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగాయి’’ అని పేర్కొన్నాడు. ''నా కుటుంబం కనీసం ఆహారం కూడా లేకుండా రాత్రిళ్లు దాక్కుంది. మేం భారత్ లో ప్రశాంతంగా జీవిస్తున్నాం. బంధువులు బంగ్లాలో ఉన్నారు. అక్కడ హిందువులు నిర్భయంగా జీవించేలా భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి’’ అని కోరాడు.