అలా చేస్తే.. రేపే యుద్ధం ముగిస్తాం.. నెతన్యాహూ కీలక ప్రకటన
మరోవైపు ఈ మిలిటెంట్ గ్రూప్ తదుపరి నాయకుడు ఎవరా అనేది కూడా చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 18 Oct 2024 10:30 AM GMTహమాస్- ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు కీలక దశలో ఉంది.. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ ను హతమార్చడంతో ఇజ్రాయెల్ బలగాలు పైచేయి సాధించినట్లయింది. సిన్వర్ నిరుటి దాడులకు సూత్రధారి అని మొదటి రోజు నుంచే ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. జూలై 31న హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ ఇరాన్ లో చంపేసింది. ఈ మధ్యలోనే మరో కీలక నాయకుడు డెయినూ తుదముట్టించింది. ఈ నేపథ్యోం హమాస్ ఇక కోలుకోవడం కష్టమేనని అంటునారు. మరోవైపు ఈ మిలిటెంట్ గ్రూప్ తదుపరి నాయకుడు ఎవరా అనేది కూడా చర్చ జరుగుతోంది.
యుద్ధం సరే.. బందీలెక్కడ..?
నిరుడు హమాస్ ఇజ్రాయెల్ లోకి చొరబడి స్థానికులను బందీలుగా చేసుకుంది. యథేచ్ఛగా కాల్పులకు తెగబడి 1,200 మంది పైగా ప్రజల ప్రాణాలు తీసింది. అంతేకాక 200 మందిపైగా వ్యక్తులను ఎత్తుకెళ్లింది. వీరిలో వందమందినే విడిచిపెట్టింది. మరో వంద మంది ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారనేది అంచనా. అయితే, వీరిలో 50 మంది చనిపోయి ఉంటారని కూడా భావిస్తున్నారు.
వారే రక్షణ కవచాలు
హమాస్ అగ్ర నాయకులు తాము అపహరించిన ఇజ్రాయెలీలు/ఇతర దేశస్తులను రక్షణ కవచాలుగా వాడుకుంటోందనే ఆరోపణలు ఉన్నాయి. సిన్వర్ కూడా ఇలానే ఏడాది నుంచి తప్పించుకున్నాడని ఇజ్రాయెల్ దళాలు ఆరోపించాయి. చాలాసార్లు అతడికి దగ్గరగా వెళ్లినా.. చుట్టూ బందీలు ఉండడంతో ఏమీ చేయలేక వెనుదిరిగాయి. తాజాగా సిన్వర్ పై దాడి చేసిన సమయంలోనూ అతడి చుట్టూ బందీలు ఎవరైనా ఉన్నారా? అనే ఆందోళన వ్యక్తమైంది. అయితే, అదేమీ లేకుండా చూసుకున్న ఇజ్రాయెల్ దాడి చేసింది.
వారిని వదిలేస్తే..
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే ఇరాన్, హెజ్బొల్లాలు హమాస్ కు మద్దతుగా రంగంలోకి దిగాయి. మరి ఈ యుద్ధానికి అంతం ఎప్పుడు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో హమాస్ చెరలోని బందీలను వదిలేస్తే రేపే యుద్ధం ముగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ చెప్పారు. ఈ మేరకు గాజా పౌరులను ఉద్దేశిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఆయుధాలను వదిలేయాలని కూడా మెలిక పెట్టారు. బందీలను వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తామని.. అలా జరగకుంటే వేటాడి వేటాడి చంపేస్తామని హెచ్చరించారు. సిన్వర్ హత్యపైనా నెతన్యాహూ నేరుగా స్పందించారు. వేలాది ఇజ్రాయెల్ పౌరులను చంపేసిన హంతకుడు మరణించాడని.. ఇదే అతిపెద్ద విజయం అని పేర్కొన్నారు. ఇక్కడితో యుద్ధం ముగియలేదని.. ఆ దిశగా అడుగు పడిందని చెప్పారు.