బెట్టింగ్ యాప్స్ కేసు : వేగంగా సిట్ దర్యాప్తు. టాలీవుడ్ లో ఆందోళన!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బెట్టింగ్ యాప్స్ కేసులో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వేగంగా కదులుతున్నారు.
By: Tupaki Desk | 31 March 2025 8:16 AMతెలంగాణలో సంచలనం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ కేసు కీలక మలుపు తిరిగింది. పలువురు సినీ ప్రముఖులు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు ఈ కేసులో చిక్కుకోవడంతో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేశారనే ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై సీరియస్‌గా ఉండటంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బెట్టింగ్ యాప్స్ కేసులో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వేగంగా కదులుతున్నారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేయగా, తాజాగా డీజీపీ జితేందర్ ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఐజీ ఎం రమేష్ సిట్ చీఫ్‌గా నియమితులయ్యారు. ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్‌లు సిట్ సభ్యులుగా ఉంటారు.
ఇప్పటికే బెట్టింగ్ యాప్స్‌పై హైదరాబాద్‌లోని పంజాగుట్ట, సైబరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో టాలీవుడ్, బాలీవుడ్ నటులతో పాటు యూట్యూబర్లు, టీవీ యాంకర్లు మొత్తం 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసులను కూడా సిట్‌కు బదిలీ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదికను అందించాలని సిట్‌ను ఆదేశించారు.
మరోవైపు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసులు నమోదు కాగా, తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోల పేర్లు కూడా ఈ కేసులో వినిపిస్తున్నాయి. ఇమ్మాని రామారావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నటులు ఒక టాక్ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారని ఆయన ఆరోపించారు. ఆ టాక్ షోకు బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించగా, స్పెషల్ ఎపిసోడ్‌లో ప్రభాస్, గోపీచంద్ కనిపించారు.
తాజాగా సిట్ ఏర్పాటుతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోలందరినీ విచారించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్‌గా ఉండటం, సిట్ ఏర్పాటు కావడంతో బెట్టింగ్ యాప్స్ కేసులో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్‌లో ఉత్కంఠ నెలకొంది.