ఆటగాడు అన్వేష్ తో బెట్టింగ్ యాప్స్ పై సజ్జనార్ యుద్ధం
దీనికోసం ఆయా యాప్స్ చేస్తున్న పనేంటో తెలుసా? సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను పట్టుకోవడం..
By: Tupaki Desk | 11 March 2025 3:52 PM ISTబెట్టింగ్ యాప్స్.. ఆన్ లైన్ కార్యకలాపాలు పెరిగిపోయిన కొద్దీ సమాజంలో పెరుగుతున్న జాడ్యం. ఒకప్పుడు పేకాట.. వంటి వాటిని ఎక్కడో చాటు మాటుగా ఆడేవారు. ఇప్పుడు వాటి స్థానంలో వాటిని మించిన వ్యసనంగా మారిపోయాయి బెట్టింగ్ యాప్స్. దీనికోసం ఆయా యాప్స్ చేస్తున్న పనేంటో తెలుసా? సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను పట్టుకోవడం..
సాధారణ వ్యక్తులు చెబితే ఎవరూ ఏది నమ్మరు.. అందుకనే సమాజంలో కాస్త ఫేస్ వాల్యూ ఉన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను పట్టుకుని వారితో చెప్పిస్తూ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు సొమ్ములు చేసుకుంటున్నారు. అప్పుంటే దాన్ని తీర్చేందుకు బెట్టింగ్ ఆడండి.. ఇల్లు కొనుక్కోవాలా..? కారు కావాలా? బెట్టింగ్ ఆడండి అంటూ ఊరిస్తూ రూ.కోట్లలో కొల్లగొడుతున్నారు. బాధితులు ఆత్మహత్యలు చేసుకోవడం.. ఆర్థికంగా పూర్తిగా దివాలా తీయడం జరుగుతోంది.
అయితే, ప్రజల కష్టార్జితాన్ని కాజేసే ఇలాంటివాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అధికార యంత్రాంగం కూడా గట్టి నిఘా పెట్టింది.
సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ ముసుగులో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నందుకు ఇటీవల విశాఖపట్నంలో ఓ ఫేమస్ యూట్యూబర్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బైక్ రైడింగ్ తో ప్రపంచ దేశాలను చుట్టివచ్చే తెలంగాణకు చెందిన ఓ యువకుడు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ దందా చేశాడనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది.
మరోవైపు ప్రజలు కూడా బెట్టింగ్ యాప్స్ మాయలో పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లలో ఎవరు ఎలాంటివారో గుర్తించాలి. అన్నిటికి మించి బెట్టింగ్ అనేది ఓ జూదం అని తెలుసుకోవాలి.
కాగా బెట్టింగ్ యాప్స్ పై ప్రభుత్వాలు సాగిస్తున్న సమరంలో నిజాయతీగల అధికారులదే కీలక పాత్ర. ఇలాంటివారిలో ముఖ్యులు తెలంగాణ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్. తాజాగా ఆయన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ తో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ‘నా అన్వేషణ’ అంటూ తనదైన యాసలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు అన్వేష్. ముఖ్యంగా తన ‘సవక.. సవక’ డైలాగ్ తో అన్వేష్ అన్ని వయసుల వారినీ ఆకట్టుకున్నారు.
అలాంటి అన్వేష్ తో బెట్టింగ్ యాప్స్ ను నిరోధించాల్సిన అవసరంపై సజ్జనార్ నిర్వహించిన లైవ్ స్ట్రీమింగ్ మంచి ప్రయత్నమే అనుకోవాలి. ప్రపంచ యాత్రలో ఉన్న అన్వేష్ ఇప్పటికి వందపైగా దేశాలు తిరిగారు. బెట్టింగ్ యాప్ ల భూతంపై కొన్నాళ్లుగా యుద్ధం చేస్తున్నారు.
దీనిని ఉద్దేశంలో ఉంచుకునే సజ్జనార్ తాజాగా అన్వేష్ తో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. సోమవారం యూట్యూబ్ లో పెట్టిన ఈ వీడియోకు 20 రోజుల్లోనే 9 లక్షల మంది చూశారు. అన్వేష్ కు చెందిన ‘ప్రపంచ యాత్రికుడు’ యూట్యూబ్ చానల్ కు 17.90 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. సరిగ్గా సంవత్సరం కిందట గత మార్చిలోనూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లపై 41 రోజుల పాటు సమరం సాగించారు. ఇప్పుడు మరోసారి సజ్జనార్ తో చేతులు కలిపి యుద్ధానికి దిగారు.