బెజవాడ మెట్రోకు వడివడి అడుగులు.. తాజా అప్డేట్ ఇదే!
ఏపీ రాజధానికి కూసింత దూరంలో ఉండే బెజవాడకు మెట్రో రైలు అవసరం గురించి కొన్నేళ్లుగా చర్చ జరుగుతున్నా.. అడుగు మాత్రం ముందుకు పడని పరిస్థితి.
By: Tupaki Desk | 29 March 2025 4:35 AMఏపీ రాజధానికి కూసింత దూరంలో ఉండే బెజవాడకు మెట్రో రైలు అవసరం గురించి కొన్నేళ్లుగా చర్చ జరుగుతున్నా.. అడుగు మాత్రం ముందుకు పడని పరిస్థితి. అవసరం ఉన్నా.. అందుకు తగ్గ అనుమతులు రాకపోవటం.. మెట్రో ప్రాజెక్టు మీద పాలకుల ఆసక్తి అంతంతమాత్రం ఉన్న వేళ.. కూటమి సర్కారు మాత్రం ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకుంది. మెట్రో ప్రాజెక్టును ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. కేంద్రం నుంచి అనుమతులు రావటం.. తొలిదశ మెట్రో కారిడార్కుఅవసరమైన భూసేకరణ కార్యక్రమాన్ని తాజాగా చేపడుతున్నారు.
వారం వ్యవధిలో విజయవాడ మెట్రో కారిడార్ 1కు అవసరమైన భూసేకరణ నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.తొలిదశలో చేపట్టే కారిడార్ 01ఎ, కారిడార్ 01బికు ఉమ్మడి క్రిష్ణా జిల్లా పరిధిలో 82.66 ఎకరాల భూమి అవసరమవుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వారం వ్యవధిలో రానుంది.
భూసేకరణకు రూ.1152 కోట్లు అవసరమవుతుందనన అంచనా వేశారు. తొలిదశలో చేపట్టే మెట్రో లైన్ కోసం సేకరించే 82.66 ఎకరాల్లో రైల్వే సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన స్థలం 1.03 ఎకరాలు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల స్థలం 4.86 ఎకరాలు ఉండగా.. ప్రైవేటు భూమి 76.77 ఎకరాలు ఉన్నాయి. భూసేకరణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయటంతో పాటు.. వీలైనంత త్వరగా విజయవాడ మెట్రో పనులు మొదలు పెట్టేందుకు చర్యలు చేపడుతున్నారు.
రామవరప్పాడు చౌరస్తా నుంచి గన్నవరం వరకు జాతీయ రహదారి మీదుగా మెట్రోలైన్ రానున్న విషయం తెలిసిందే. ఈ మార్గంలో ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా ఉండి ఉండటంతో.. ఒకదానిపై మరొక ఫ్లైఓవర్ ను..దానిపై మెట్రో.. డబుల్ లైన్ లో రానున్నాయి. అందుకే ఎన్ హెచ్ఏఊ.. మెట్రోకలిసి ఒకేసారి ప్రణాళికను రూపొందించి ముందుకు వెళ్లనున్నాయి. భూసేకరణ కార్యక్రమం మొదలైనంతనే.. మిగిలిన పనుల్ని సమాంతరంగా మొదలు పెట్టేందుకు వీలుగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు.