మరోసారి బెజవాడ హీట్.. అమ్మవారి పాదాల ముందు టీడీపీ నేత అప్లికేషన్!
బెజవాడ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో టికెట్ల కోసం నేతలు పోటీపడుతున్నారు.
By: Tupaki Desk | 1 Feb 2024 1:01 PM GMTబెజవాడ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో టికెట్ల కోసం నేతలు పోటీపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీలో ఈ పోటీ ఎక్కువగా ఉంది. విజయవాడ నగరంలో మూడు అసెంబ్లీ సీట్లు ఉండగా వీటిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆశించే నేతలు ఎక్కువయ్యారు. అందులోనూ జనసేన పార్టీ, టీడీపీ కలిసి పోటీ చేస్తుండటంతో నేతలు ఈ సీటు తమకంటే తమకని పోటీ పడుతున్నారు.
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా ప్రస్తుతం వైసీపీ తరఫున వెలంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. ఈసారి ఆయనను విజయవాడ సెంట్రల్ కు మార్చారు. వైసీపీ తరఫున ముస్లిం అభ్యర్థికి వచ్చే ఎన్నికలకు సీటు ఇచ్చారు.
ఇక జనసేన పార్టీ తరఫున పోతిన మహేశ్ ఈ సీటును ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన వచ్చే ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది తానేనంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.
మరోవైపు టీడీపీ తరఫున విజయవాడ పశ్చిమ సీటును మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మరో నేత ఎంకే బేగ్ ఆశిస్తున్నారు. ముస్లింలకు ఈ సీటు ఇవ్వాలని.. ముఖ్యంగా తనకు లేదా తన కుమార్తెకు ఈ సీటు ఇవ్వాలని జలీల్ ఖాన్ కోరుతున్నారు. ఇవ్వకపోతే ముస్లింలు ఉరేసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక బుద్ధా వెంకన్న ఏకంగా బలప్రదర్శనకు దిగారు. తన అనుచరులు, కార్యకర్తలతో తన నివాసం నుంచి అమ్మవారి గుడి వరకు పాదయాత్ర చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయవాడ పశ్చిమలో పోటీ చేసేది తానేనంటూ తేల్చిచెప్పారు. తన దరఖాస్తును టీడీపీ అధినేత చంద్రబాబుకు సమర్పించే ముందు అమ్మవారి పాదాల వద్ద పెట్టి పూజ చేయడానికి వచ్చానన్నారు
విజయవాడ పశ్చిమ నుంచి అసెంబ్లీకి లేదా అనకాపల్లి నుంచి పార్లమెంటుకు పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని బుద్ధా వెంకన్న కోరారు. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కేశినేని నాని అనే కుక్కకు బుద్ధి చెప్పాలని ర్యాలీగా వచ్చానని బుద్ధా వెంకన్న హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు తనకు దైవసమానులని వ్యాఖ్యానించారు. కేశినేని వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ గురించే మాట్లాడే కుక్కల తాట తీస్తానని హెచ్చరించారు. అమ్మవారి పాదాల ముందు తాను అప్లికేషన్ పెట్టడానికి వస్తే భారీగా కేడర్ తరలివచ్చారన్నారు. తనకు టికెట్ కేటాయించాలని చంద్రబాబు, పవన్ ఇద్దర్నీ కోరుతున్నానన్నారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో విజయవాడ పాలిటిక్స్ మరోసారి ఆసక్తిగా మారాయి. విజయవాడ పశ్చిమ సీటును ఆశించేవారు ఎక్కువగా ఉండటం, మరోవైపు జనసేన కూడా ఈ సీటు తమకేనని చెబుతుండటంతో ఈ సీటును ఏ పార్టీ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.