Begin typing your search above and press return to search.

బెజోస్ 'బేర్' మాంద్యం భయాలు 1.25 లక్షలు కోట్లు ఉఫ్

కానీ, ఇప్పుడు ప్రపంచ పరిస్థితులను తలుచుకుని అమెరికా వణుకుతోందా?

By:  Tupaki Desk   |   3 Aug 2024 11:46 AM GMT
బెజోస్ బేర్  మాంద్యం భయాలు  1.25 లక్షలు కోట్లు ఉఫ్
X

ఒకప్పుడు అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముందనేవారు. మార్కెట్లను ఊహలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేసేవారు. కానీ, ఇప్పుడు ప్రపంచ పరిస్థితులను తలుచుకుని అమెరికా వణుకుతోందా?

అమెరికాలో ఓపక్క ఎన్నికల కోలాహలం నెలకొంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు. అధ్యక్షుడు బైడెన్ అభ్యర్థిత్వంతో ఒడిదొడుకులు ఎదుర్కొన్న డెమోక్రాట్లు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను ముందుకుతెచ్చి పోరాటం చేయాలని చూస్తున్నారు. ఇదే సమయంలో ఉరుములేని పిడుగులా మాంద్యం భయాలు అమెరికా మార్కెట్లను వణికించాయి.

ఓవైపు యుద్ధాలు..

ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్, ఇజ్రాయెల్-ఇరాన్, ఇజ్రాయెల్-లెబనాన్, ఇంకా తైవాన్-చైనా, దక్షిణ కొరియా-ఉత్తర కొరియా.. అంతర్జాతీయంగా అనేక సమస్యలు. ఇజ్రాయెల్ మీద దాడికి ఇరాన్, లెబనాన్ సిద్ధపడుతుంటే.. అమెరికా ఇజ్రాయెల్ కు అండగా నిలుస్తోంది. పరోక్షంగానైనా ఉక్రెయిన్ ను సమర్థిస్తోంది. ఇవన్నీ అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులు. దీంతో అమెరికా మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి.

అమెరికాకు జలుబు.. ప్రపంచానికి తుమ్ము

ఒకప్పుడు అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముందనేవారు. మార్కెట్లను ఊహలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేసేవారు. కానీ, ఇప్పుడు ప్రపంచ పరిస్థితులను తలుచుకుని అమెరికా వణుకుతోందా? అనే పరిస్థితి కనిపిస్తోంది. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులతో అమెరికా దిగ్గజ కంపెనీ షేర్లు కుంగడమే దీనికి నిదర్శనం. ఈ దెబ్బకు ఒక్క రోజులోనే అపర కుబేరుల సంపద భారీగా ఆవిరైంది. అందరికంటే.. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఉన్న, ఇప్పుడు ఇంటింటికీ తెలిసిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ షేర్లు భారీగా పతనం అయ్యాయి. దీంతో అమెజాన్ అధినేత జెఫ్‌ బెజోస్‌ సంపదలో ఏకంగా రూ. 1.25 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.

బ్లాక్ ఫ్రైడే..

అమెరికా కాలమానంలో ఈ శుక్రవారం బ్లాక్ ఫ్రైడే నేమో..? లేదంటే అమెజాన్ కు అయినా బ్లాక్ ఫ్రైడే అనుకోవాలి.. ట్రేడింగ్‌లో ఆ సంస్థ షేర్లు 8.8శాతం మేర నష్టాలను చవిచూశాయి. ఈ లెక్కన జెజోస్‌ నికర సంపద 15.2 బిలియన్‌ డాలర్ల మేర తగ్గింది. 191.5 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. కాగా, బెజోస్ గతంలో రెండు సార్లు ఈ స్థాయిలో నష్టాన్ని చూశారు. అయితే, అది 2019 ఏప్రిల్‌ 4న తన విడాకుల ప్రకటన చేసినప్పుడు 36 బిలియన్ డాలర్ల మేర ఆయన సంపద కుంగింది. 2022 ఏప్రిల్‌లోనూ అమెజాన్‌ షేర్లు 14శాతం మేర పతనం అయ్యాయి.

బెజోస్ మాత్రమే కాదు..

అమెజాన్ బెజోస్ మాత్రమే కాదు.. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 500 మంది అపర కుబేరుల నికర సంపదలో ఏకంగా 134 బిలియన్‌ డాలర్ల మేర ఆవిరైంది. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ 6.6 బిలియన్‌ డాలర్లు, ఒరాకిల్‌ కార్పొరేషన్‌ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిస్‌ 4.4 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చవిచూశారు. మెటా అధిపతి మార్క్‌ జుకర్‌ బర్గ్‌, గూగుల్‌ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్‌, ల్యారీ పేజ్‌ 3 బిలియన్‌ డాలర్ల చొప్పున కోల్పోయారు. కాగా, నికర సంపదలో (235 బిలియన్ డాలర్లు) మస్క్‌, ఆ తర్వాత బెజోస్‌, బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ (182 బిలియన్‌ డాలర్లు) మూడో స్థానంలో కొనసాగుతున్నారు. జుకర్‌ బర్గ్‌, బిల్‌ గేట్స్‌ లది తర్వాతి స్థానాలు.