భద్రాద్రిపై కేటీఆర్ కొత్త హామీ.. నాన్నను అడిగే ఇస్తున్నావా?
కొందరికి కొన్ని ఇష్టం ఉండవు. దానికి ప్రత్యేక కారణాలు కూడా కనిపించవు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా అంతే
By: Tupaki Desk | 20 Nov 2023 3:46 AM GMTకొందరికి కొన్ని ఇష్టం ఉండవు. దానికి ప్రత్యేక కారణాలు కూడా కనిపించవు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా అంతే. ఆయనకు భద్రాద్రి మీద పెద్ద ఆసక్తి కనిపించదు. యాదాద్రి మీద చూపించిన శ్రద్ధ భద్రాద్రి మీద చూపించరు. ఆ మాటకు వస్తే తెలంగాణ వచ్చిన ఈ పదేళ్లలో.. శ్రీరామనవమి వేళ.. ఉమ్మడి రాష్ట్రానికి భిన్నంగా రాములోరి కల్యాణానికి నెత్తి మీద ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లే విషయంలోనూ కేసీఆర్ చూపించే అనాసక్తి ప్రతి ఏడాది వార్తాంశంగా మారుతోంది. అయినప్పటికీ.. దాని గురించి క్లారిటీ ఇచ్చింది లేదు.
యాద్రాద్రిని మొత్తంగా మార్చేసిన కేసీఆర్ అనుకోవాలే కానీ భద్రాద్రి రూపురేఖలు మార్చటం పెద్ద విషయం కాదు. కానీ.. ఆయన మాత్రం ఆ విషయానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు ఇదిలా ఉంటే..తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ భద్రాచలం.. ఇల్లెందు రోడ్ షోలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య వచ్చింది. భద్రాచలం ప్రజలు చిన్న చిన్న అసంతృప్తులను పక్కన పెట్టి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని కోరటం గమనార్హం.
కేటీఆర్ నోటి నుంచే చిన్న చిన్న అసంతృప్తి అన్న మాట వచ్చిందంటేనే.. దానికి వెనుక ఎంత లెక్క ఉండే అలా మాట్లాడతారు? అన్న సందేహాం కలుగక మానదు. కారణాలు ఏమైనా.. భద్రాచలం ప్రజలు తమకు అవకాశం ఇవ్వవలేదని.. ఈసారైనా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపించాలని కోరారు. గడిచిన రెండు పర్యాయాలు బీఆర్ఎస్ అభ్యర్థి గెలవకపోవటం వల్ల గ్యాప్ వచ్చిందని.. ఈసారైనా ఎన్నికల్లో గెలిపిస్తే.. భద్రాచలం రామయ్య ఆలయాన్ని యాదాద్రి కంటే గొప్పగా డెవలప్ చేస్తామని హామీ ఇవ్వటం గమనార్హం.
అంతేకాదు.. వరదల ముందపు నుంచి శాశ్విత పరిష్కారం చూపిస్తామన్న కేటీఆర్ మాటల్ని చూశాక అర్థమయ్యేదేమంటే.. ఇంతకాలం భద్రాచలం మీద కేసీఆర్ శీతకన్ను వేసింది.. తమ పార్టీ ఎమ్మెల్యేను గెలిపించలేదనేనా? అన్న సందేహం కలుగక మానదు. ఎంత ఎమ్మెల్యేను గెలిపించకపోతే మాత్రం పుణ్యక్షేత్రాన్ని పట్టించుకోకపోవటం ఏమిటనిపించక మానదు. అయినా.. దేవుడి విషయంలోనూ రాజకీయాలు అవసరమా? అన్న సందేహం కలగటం ఖాయం. ఇలాంటి హామీలు ఇచ్చే ముందు.. మంత్రి కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ ను అడిగి హామీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.