టీ కోసం ఆపరేషన్ మధ్యలో వెళ్లిపోయాడు... ఎవరీ డాక్టర్ భలవీ?
అవును... మహారాష్ట్ర నాగ్ పుర్ జిల్లాలోని మౌదా ప్రాంతంలోని ఖట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి ఎనిమిది మంది మహిళలు వచ్చారు.
By: Tupaki Desk | 8 Nov 2023 10:43 AM GMTఒక్కో మనిషికీ ఒక్కో అలవాటు అమితంగా ఉంటుందని అంటారు. అది అలవాటుగా ఉన్నంత కాలం పర్లేదు.. అనవసరం అనిపించినప్పుడు మానేయొచ్చు! కానీ... అది వ్యసనంగా మారితే మాత్రం తనువు చాలించే వరకూ దానితో సావాసం తప్పదని చెబుతుంటారు. ఆ సంగతి అలా ఉంచితే... టీ ఇవ్వలేదనే కోపమో, సమయానికి టీ పడకపొతే పిచ్చి పట్టుకుంటుందో తెలియదు కానీ... ఆపరేషన్ థియేటర్ నుంచి మద్యలో వెళ్లిపోయాడో వైద్య ప్రభుద్దుడు!
అవును... మహారాష్ట్ర నాగ్ పుర్ జిల్లాలోని మౌదా ప్రాంతంలోని ఖట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి ఎనిమిది మంది మహిళలు వచ్చారు. వీరిలో నలుగురి మహిళలకు డాక్టర్ తేజ్ రాం భలవీ సర్జీరీ పూర్తిచేశారు. అనంతరం మిగతా నలుగురు మహిళలను ఆపరేషన్ థియేటర్ లోకి తరలించారు. ఈ సమయంలో తనకు టీ కావాలని డాక్టర్ భలవీ... ఆస్పత్రి సిబ్బందిని అడిగారు!
అలా సిబ్బందికి ఒక టీ తెప్పించండి అని చెప్పేసి మరళా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లిపోయారు. ఈ సమయంలో ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లి.. మిగిలిన నలుగురు మహిళలకు అనెస్తీషియా ఇచ్చారు. ఈ సమయంలో మరోసారి బయటకు వచ్చారు. అయితే ఆ సమయంలో ఎవరూ టీ ఇవ్వలేదు. చెప్పి ఇంతసమయమైనా టీ అందకపోయే సరికి ఆగ్రహం తెచ్చుకున్నారు! ఈ సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు!
ఇందులో భాగంగా ఆపరేషన్ థియేటర్ లో మత్తులో ఉన్న నలుగురు మహిళలను అలాగే వదిలేసి, సర్జరీలు చేయకుండానే బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆస్పత్రిలో ఒకేసారి తీవ్ర అలజడి నెలకొంది. అయితే ఈ వ్యవహారం గురించి ఆపరేషన్ థియేటర్ లో ఉన్న నలుగురు మహిళల్లో ఒక మహిళ కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వెంటనే వారు అధికారులకు సమాచారం అందించారు.
అదే సమయంలో జిల్లా మెడికల్ ఆఫీసర్ కు కూడా సదరు మహిళల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకుని వెంటనే మరో వైద్యుడ్ని రప్పించారు. అతనితో మిగిలిన నలుగురు మహిళలకూ ఆపరేషన్లు పూర్తిచేశారు. అనంతరం... ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా పరిగణించిన అధికారులు... దర్యాప్తుకు ఆదేశించారు.
ఈ విషయంపై స్పందించిన జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు కుంట రౌత్... వైద్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఏర్పాటూ చేసిన విచారణ కమిటీ డాక్టర్ భాలవిని దోషిగా తేల్చితే జిల్లా పరిషత్ కఠిన చర్యలు తీసుకుంటుందని ఉద్ఘాటించారు.