Begin typing your search above and press return to search.

మద్దెల చెరువు సూరి హత్య కేసులో బిగ్ ట్విస్ట్!... భాను విడుదల!

మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ విడుదలయ్యాడు.

By:  Tupaki Desk   |   6 Nov 2024 11:11 AM GMT
మద్దెల చెరువు సూరి హత్య కేసులో  బిగ్  ట్విస్ట్!... భాను విడుదల!
X

మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ విడుదలయ్యాడు. సుమారు 12 ఏళ్ల తర్వాత చంచల్ గూడ జైలు నుంచి భాను కిరణ్ బయటకు వచ్చాడు. సూరి హత్య కేసులో జైలులో ఉన్న భానుకు ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నేడు జైలు నుంచి భాను విడుదలయ్యాడు.

అవును... మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ కు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే! సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసులో నాంపల్లి కోర్టు భానుకు బెయిల్ మంజూరు చేసింది. వాస్తవానికి సూరి మర్డర్ కేసులో కోర్టు జీవిత ఖైదు విధించడంతో 12 ఏళ్లుగా అతడు చంచల్ గూడ జైల్లోనే ఉంటున్నాడు.

2011 జనవరి 4న మద్దెల చెరువు సూరిని భాను హత్య చేశాడు! అప్పట్లో ఈ వార్త పెను సంచలనంగా మారింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి నిందితుడిగా ఉన్నాడు. అయితే.. 2011 జనవరి 4న హైదరాబాద్ లోని నవోదయా కాలనీ ప్రాంతంలో సూరిని భాను కాల్చి చంపాడు.

కాగా.. పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి ప్రధాన నిందితుడు. 2005లో పరిటాల రవిని సూరి కాల్చి చంపినట్లు చెబుతారు! దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 2011లో బెయిల్ పై వచ్చిన సూరిని భాను కిరణ్ కాల్చి చంపాడు. ఈ కేసును విచారించిన కోర్టు.. భానుకు జీవిత ఖైదు విధించింది.

వాస్తవానికి తాను ఇప్పటికే ఎంతో శిక్ష అనుభవించానని, బెయిల్ ఇవ్వాలని సుప్రీం కోర్టును భాను కోరాడు. అయితే... దీన్ని స్థానిక కోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం సూచించింది. ఈ పిటిషన్ ఈ నెల 11న విచారణకు రానుంది. అయితే.. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసులో బెయిల్ రావడంతో భాను విడుదలయ్యాడు.