Begin typing your search above and press return to search.

భరత మాత హిందూ దేవత.. కన్నడ నాట రగడ

అయితే, తాజాగా భరత మాత హిందూ దేవత అని పాఠ్య పుస్తకాల్లో పేర్కొన్నారని.. ఇది సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం అని సామాజికవేత్తలు పలువురు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ కు లేఖ రాశారు.

By:  Tupaki Desk   |   23 Jan 2025 11:52 AM GMT
భరత మాత హిందూ దేవత.. కన్నడ నాట రగడ
X

దక్షిణాదిలో మతపరంగా కాస్త సున్నితం కర్ణాటకనే అని చెప్పాలి. గతంలో ఈ రాష్ట్రంలో పలు సంచలన ఘటనలూ చోటుచేసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ బలంగా ఉన్న రాష్ట్రం కావడంతో కర్ణాటకలో ఏం జరిగినా జాతీయ స్థాయిలోనూ ప్రకంపనలు వస్తుంటాయి. పైగా కర్ణాటకను దక్షిణాదిన తమ ప్రవేశ ద్వారంగా బీజేపీ అభివర్ణిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 2023కు ముందు ఐదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి.

ఇక 20 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ విధానాలకు తోడు సీఎంల మార్పు, తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలతో ఓడిపోయింది. ఎన్నికల అనంతరం సిద్ధరామయ్య సారథ్యంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడింది. ఇప్పుడు కర్ణాటకలో ప్రతిపక్ష బీజేపీ- అధికార కాంగ్రెస్ నడుమ రాజకీయ సంకుల సమరం నడుస్తోంది.

తెరపైకి భరత మాత కర్ణాటకలో రాజకీయాలు మతంతో ముడిపడి ఉంటాయి. అక్కడి మఠాలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇందులో తప్పుబట్టాల్సింది ఏమీ లేదు. అయితే, తాజాగా భరత మాత హిందూ దేవత అని పాఠ్య పుస్తకాల్లో పేర్కొన్నారని.. ఇది సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం అని సామాజికవేత్తలు పలువురు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ కు లేఖ రాశారు.

కేఏ విశ్వవిద్యాలయం పుస్తకాల్లోని ఈ మేరకు అభివర్ణణను తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. భరత మాత హిందూ దేవత అని ఇతర మతాల వారికి సంబంధం లేదనడాన్ని సామాజికవేత్తలు తప్పుబడుతున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించకుండా ఉండాల్సిందని పుస్తకాల్లో ఉందని, ఆర్ఎస్ఎస్ సమాజాన్ని విడదీస్తోందని పుస్తకాల్లో రాశారని ఆరోపించారు. వీటిపై చర్యలకు గవర్నర్ ను కోరారు. మరి ఆయన స్పందన ఎలా ఉంటుందో..? సిద్ధరామయ్య సాథర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో చూడాలి.