ఎన్టీఆర్ కి భారతరత్న...బాలయ్యకు పద్మ భూషణ్ ?
తాజాగా మరోసారి ఎన్టీఆర్ కి భారతరత్న అన్న మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నోట వినిపించింది.
By: Tupaki Desk | 15 Dec 2024 3:36 AM GMTదివంగత నేత, తెలుగు జాతి గర్విస్తే నాయకుడు అయిన నందమూరి తారక రామారావు భారత రత్న వంటి అత్యున్నత పౌర పురస్కారానికి నూరు శాతం అర్హుడు. ఆయనకు ఏనాడో ఆ అవార్డు వచ్చి ఉండాలి. సినీ రంగంలో ఆయన చేసిన సినిమాలు భారతీయ పురాణేతి హాసాలను కలుపుకుని ఉన్నవే. ఆయన ఆ విధంగా భారతీయ నటుడిగానే చెప్పాలి.
రాజకీయాల్లోకి వచ్చి నేషనల్ ఫ్రంట్ వంటి అపూర్వమైన జాతీయ సంఘటనకు పురుడు పోసిన అన్న గారిని జాతీయ నాయకుడు అని చెప్పి తీరాల్సిందే. దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శిబిరానికి బలమైన పునాదులు వేసిన ఎన్టీఆర్ తన పద్నాలుగేళ్ల రాజకీయ జీవితంలో దేశ స్థాయిలో బలమైన ముద్ర వేశారు
ఆయన ప్రారంభించిన సంక్షేమ పధకాలు ఈ రోజున దేశానికి ఆదర్శం అయ్యాయి. అలాగే ఆయన రాజకీయ విధానాలూ నినాదాలూ కూడా ఎందరికో అనుసరణీయం అయ్యాయి. అటువంటి ఎన్టీఆర్ కి భారత రత్న దక్కడం అంటే ప్రతీ తెలుగు వారి గుండె ఉప్పొంగి పోవడం ఖాయం.
తాజాగా మరోసారి ఎన్టీఆర్ కి భారతరత్న అన్న మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నోట వినిపించింది. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన చంద్రబాబు భారత రత్న వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. అది ఎన్టీఆర్ అభిమానులు అందరికీ ఎంతో ఆనందకరమైన వార్తగా మారింది.
ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం టీడీపీ ఎంపీల మద్దతు మీద ఆధారపడి ఉంది. దాంతో ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేయాలే కానీ ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వడం పెద్ద విషయం ఏమీ కాదని అంటున్నారు. 2025 గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటించే పౌర పురస్కారాలలో ఎన్టీఆర్ కి భారత రత్న అవార్డుని ప్రకటిస్తే అంతా సంతోషిస్తారు అని అంటున్నారు.
ఇక యాభై ఏళ్ళ సినీ నట ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్న నందమూరి బాలక్రిష్ణకు పద్మ భూషణ్ అవార్డు లభిస్తుందని గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది. ఈ మేరకు ఆయన పేరుని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది అని కూడా అంటున్నారు.
మరి ఎన్టీఆర్ కి భారత రత్న బాలయ్యకు పద్మ భూషణ్ ఒకేసారి ఇస్తారా అన్నది ఇక్కడ పాయింట్. అదే కనుక జరిగితే నందమూరి ఫ్యాన్స్ కి అది అతి పెద్ద పండుగ అనడంలో సందేహమే లేదు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఇద్దరికీ మైల్ స్టోన్ లాంటి వజ్రోత్సవ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఘనమైన పౌర పురస్కారాలు ఇస్తుందా అంటే ఆ ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిందే.
ఒకవేళ అదే జరిగితే తండ్రీ కొడుకులకు ఒకేమారు అత్యున్నత పౌర పురస్కారాలు దక్కిన రికార్డు కూడా నందమూరి వంశానిదే దక్కుతుంది. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న దానిని బట్టి చూస్తే పద్మ పురస్కారం బాలయ్యకు కన్ ఫర్మ్ అయినట్లే అని అంటున్నారు. ఎన్టీఆర్ భారత రత్న విషయంలో అయితే కేంద్రం తలచుకుంటే అది గణ తంత్ర వేడుకల్లోనే కాదు ఎపుడైనా ప్రకటించవచ్చు అని అంటున్నారు. మరి 2025 నందమూరి నామ సంవత్సరం అవుతుందా అంటే చూడాల్సి ఉంది.