Begin typing your search above and press return to search.

ధరణితో కేసీఆర్ సర్కారు అంత చేసిందంటూ భట్టి సంచలనం!

అయితే.. ఆయన పాలనలో భాగంగా ఆయనెంతో ఇష్టంగా తీసుకొచ్చిన కొన్నింటిలో ధరణి ప్రధానం.

By:  Tupaki Desk   |   19 Dec 2024 4:43 AM GMT
ధరణితో కేసీఆర్ సర్కారు అంత చేసిందంటూ భట్టి సంచలనం!
X

గులాబీ బాస్ గా సుపరిచితుడు.. తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదిన్నరేళ్లు నాన్ స్టాప్ గా పాలించిన కేసీఆర్ గురించి.. ఆయన పాలన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. అయితే.. ఆయన పాలనలో భాగంగా ఆయనెంతో ఇష్టంగా తీసుకొచ్చిన కొన్నింటిలో ధరణి ప్రధానం. దీంతో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసినట్లుగా.. దరణితో ఎన్నో చిక్కుముడులు వీడినట్లుగా కేసీఆర్ అండ్ కో చెప్పుకోవటం తెలిసిందే. నిజానికి అదే ధరణి.. ఆయన చేతి నుంచి అధికారం చేజారటానికి కారణమన్న మాట బలంగా వినిపించటం తెలిసిందే.

ధరణిని తొలి నుంచి వ్యతిరేకించే రేవంత్ సర్కారు.. దాని స్థానంలో కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొస్తామన్న విషయాన్ని ఎన్నికల ముందు నుంచి చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ధరణిపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని ముసుగులో విలువైన ప్రభుత్వ.. ఇనాం.. పడావు.. ఎవాక్కుయి భూములకు సంబంధించి వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనట్లుగా ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు.

ధరణి ముసుగులో దాదాపు 15 వేల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లుగా ఆరోపించారు. ఇంత భారీగా చేతులు మారిన భూముల విలువ అక్షరాల రూ.1.5 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తన కార్యాలయంలో చిట్ చాట్ చేసిన భట్టి.. ధరణిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అన్యాక్రాంతమైన భూములే కాకుండా అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే మళ్లీ ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని కానీ ఇబ్రహీం పట్నం పరిధిలోని 10 వేల ఎకరాల విషయంలో అందుకు భిన్నమైన పరిస్థితి చోటు చేసుకుందన్నారు.

ఇబ్రహీంపట్నం మండలంలో 10వేల ఎకరాలను ధారాదత్తం చేసినట్లుగా పేర్కొన్న భట్టి.. ‘గతంలో భూముల రిజిస్ట్రేషన్ అనంతరం రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే భూముల మ్యుటేషన్ జరిగేది. పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చేవి. ధరణి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయినంతనే మ్యుటేషన్ జరగటం.. ధరణి పోర్టల్ లో వేలిముద్రలు.. ఫోటోలు రాగానే అక్కడికక్కడే ఇతరులకు అమ్మేయటం వల్ల అసలు భూముల చరిత్ర తెలియకుండానే అమ్మకాలు.. కొనుగోళ్లు జరిగిపోయాయి’’ అని పేర్కొన్నారు.

ఒకసారి ధరణిలో ఎంట్రీ అయ్యాక వాటిని మార్చే అవకాశం లేకపోయిందని.. కొన్నింటిని కావాలనే పార్టు బిలో చేర్చారని.. దీన్ని అడ్డు పెట్టుకొని పెద్ద ఎత్తున చేతులు మారినట్లుగా పేర్కొన్నారు. ధరణిలో ఒక్క భూ యజమాని పేరు మినహా కాస్తుదారులు.. అనుభవదారుల కాలమ్ లేకపోవటంతో ఇష్టానుసారం భూములు చేతులు మారినట్లుగా పేర్కొన్నారు. ధరణికి ముందున్న రికార్దులను.. ధరణిలోకి వచ్చిన తర్వాత మారిన భూముల వివరాలను పరిశీలిస్తామని పేర్కొన్న భట్టి మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. ‘‘పూర్తిస్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. భూములు మూడు.. నాలుగు చేతులు మారినా.. ప్రభుత్వానికి చెందిన భూములుగా తేలితే స్వాధీనం చేసుకుంటాం. ప్రధానంగా పార్టు బీ కింద పెట్టిన భూముల్లోనే ఈ దందా పెద్ద ఎత్తున సాగింది’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.