కేసీఆర్ అధికారిక నివాసం.. ఇక ఆ మంత్రి నివాసం..
కాంగ్రెస్ పార్టీ అధికారిక నివాసాలను ఒక్కొక్కటిగా ఆధీనంలోకి తీసుకుంటుంది. పాలనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటుంది.
By: Tupaki Desk | 13 Dec 2023 11:10 AM GMTకాంగ్రెస్ పార్టీ అధికారిక నివాసాలను ఒక్కొక్కటిగా ఆధీనంలోకి తీసుకుంటుంది. పాలనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ బంగ్లాలు, స్థలాలను కాంగ్రెస్ పార్టీ పాలనకు ఉపయోగించుకుంటుంది. దీనిలో భాగంగా హైదరాబాద్ నడిబొడ్డులోని బేగంపేట్ లో ఉండే ‘ప్రగతి భవన్’ను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ‘ప్రగతి భవన్ గేట్లను కూల్చివేస్తానని, ప్రజలకు పాలకులకు అడ్డుగా ఉన్న భారికేడ్లను కూలుస్తానని’ ఎన్నికల ప్రచారంలో రేవంత్ అన్నారు. ఆ మేరకు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు (డిసెంబర్ 07)న ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను తొలగించారు.
ప్రమాణ స్వీకారం తర్వాత ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రగతి భవన్ కు ‘మహాత్యా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్’గా నామకరణం చేశారు. ఇక అప్పటి నుంచి ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తదితరులు ఇక్కడే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అయితే గత ప్రభుత్వంలో కేసీఆర్ అధికారిక నివాసం కావడంతో ఇక్కడే కీలక సమావేశాలు జరిగేవి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రముఖులతో నిత్యం రద్దీగా ఉండేది ఈ ప్రజా భవన్.
అయితే, రేవంత్ ప్రభుత్వం ఇటీవల మరో నిర్ణయం తీసుకుంది. ప్రజా భవన్ ఇక నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ఉండబోతోందని చెప్పారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి జీవో నెం. 1638 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డు, రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఈ భవంతిని భట్టీకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంతో భట్టీ తన నివాసాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క అధికారిక కార్యక్రమాలు ఇక్కడి నుంచే కొనసాగించనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు సామాన్యులకు ప్రజా భవన్ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ప్రభుత్వం భట్టీకి ప్రజా భవన్ కేటాయించడంపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.