రేణుకా చౌదరి కాళ్లకు ముందర బంధం.. భట్టి మాస్టర్ ప్లాన్!
ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నారు. దీంతో తాను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు కాదు కాబట్టి..తన సతీమణి నందినిని రంగంలోకి దింపేశారు.
By: Tupaki Desk | 4 Feb 2024 1:19 AM GMTఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నేతలుగా చలామణి అవుతున్న వారిలో చాలామందికి వర్గ విభేదాలు.. సామాజిక విబేదాలు కూడా ఉన్నాయి. మాజీ ఎంపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు..రేణుకా చౌదరికి, ఎస్సీ నాయకుడు, మధిర నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రి భట్టి విక్రమార్కకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వివాదాలు ఏళ్ల తరబడి కొనసాగాయి. "ఆయన వస్తే.. నేనెందుకు" అని ఆమె, "ఆమె ఉంటే నేను రాను" అనిఈయన పార్టీ కార్యక్రమాలకు వంతుల వారీ డుమ్మా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. గత ఎన్నికల ముందు భట్టి పాదయాత్ర చేశారు. జిల్లాలో జోరుగా తిరిగారు.
అయితే.. భట్టి చేసిన ఈ పాదయాత్రపై.. అప్పట్లో రేణుక సటైర్లు వేశారు. "కొందరు తిరుగుతున్నారు.. తిరగనివ్వండి కొలస్ట్రాల్ అయినా..తగ్గుతుంది" అని వ్యాఖ్యానించగా.. భట్టి.. దీనికి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. "తిని కూర్చునేవాళ్లకు పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు" అన్నారు. ఇలా.. ఒకరికొకరు.. కౌంటర్లు వేసుకోవడమే కాదు.. ఛాయలకు కూడా రాకుండా రాజకీయాలు చేసుకుంటున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల సమయం దగ్గర పడుతున్ననేపథ్యంలో రేణుకా చౌదరి ఖమ్మం సీటును ఆశిస్తున్నారు. దీని నుంచి ఆమె పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. "సోనియా పోటీ చేస్తానంటే మాత్రమే నేను తప్పుకుంటా.. ఇతరులు వస్తానంటే.. ఎలా ఒప్పుకొంటా! నేనేంటో అప్పుడు చూపిస్తా" అని దురుసు వ్యాఖ్యలు చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు రేణుకా చౌదరి ముందర కాళ్లకు భట్టి భందం వేసేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నారు. దీంతో తాను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు కాదు కాబట్టి..తన సతీమణి నందినిని రంగంలోకి దింపేశారు. తాజాగా ఆమె తన బలప్రదర్శన చేసుకున్నారు. ఏకంగా 300 కార్లతో ఖమ్మం జిల్లా నుంచి భారీ ర్యాలీగా నందిని హైదరాబాద్‌కు వచ్చారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో హైదరాబాద్‌కు వచ్చిన ఆమె గాంధీభవన్‌లో ఖమ్మం ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
సోనియా, ప్రియాంక ఖమ్మం నుంచి పోటీ చేయకుంటే తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు నందిని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తా అని ధీమా వ్యక్తం చేశారు. కానీ, అంతర్గతంగా ఉన్న కుమ్ములాటల నేపథ్యంలోనే ఇంత హడావుడిగా.. నందినితో దరఖాస్తు చేయించారని అంటున్నారు పరిశీలకులు. రేణుకతో ఉన్న వివాదాల నేపథ్యంలో ముందుగానే తాము అడిగేస్తే.. పడి ఉంటుందని.. తర్వాత ఏం జరిగినా చూసుకోవచ్చనే ధీమాలోనే ఇలా చేశారనేది ఖమ్మం టాక్. మరోవైపు జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న రేణుక.. దీనిపై ఢిల్లీలోనే తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు.