వైఎస్సార్ పేరు గుర్తుచేసిన భట్టి... తెరపైకి కీలక వ్యాఖ్యలు!
అవును.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖారారైంది
By: Tupaki Desk | 7 Dec 2023 7:05 AM GMTసుమారు 10ఏళ్లుగా కలలుగంటున్న గడియ రానే వచ్చింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్న ఆ పార్టీ నేతల కల నిజమైంది! ఈ సమయంలో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. మరికొంతమంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు! ఈ సమయంలో తెలంగాణ డిప్యూటీ సీఎంగా చెబుతున్న భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక పేరు మారు మ్రోగిపోయింది!
అవును.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖారారైంది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమయంలో భట్టి విక్రమార్కకు కీలక మంత్రిత్వ శాఖ దక్కినట్లు చెబుతున్నారు.
ఈయనతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ తర్వాత తెలంగాణ ప్రజల దృష్టంతా భట్టి విక్రమార్కపైనే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఈ సమయంలో ప్రమాణ స్వీకారానికి బయలుదేరడానికి ముందు.. భట్టి విక్రమార్క తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా పూజగదిలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్సార్ పై తనకున్న అభిమానాన్ని భట్టి తన మాటల్లో వ్యక్తపరిచారు!
ఈ సందర్భంగా స్పందించిన భట్టి... రాష్ట్రంలో మరోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనను అందరం చూడబోతోన్నామని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి! ఇదే సమయంలో... ప్రజల కోసం వైఎస్సార్ పడిన తపనను దగ్గరి నుంచి చూశానని చెబుతున్న భట్టి... తామందరికీ ఆయన ఆరాధ్యదైవమని వ్యాఖ్యానించారు. అదేవిధంగా తాను ఎప్పటికీ వైఎస్సార్ ను గురువుగా భావిస్తామని, ఆయన చూపిన బాటలోనే నడుస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ సందర్భంగా... వైఎస్సార్ పేరు చెబితే గుర్తుకు వచ్చే ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్ మొదలైన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా భట్టి గుర్తుచేసుకున్నారు. అలాంటి చారిత్రాత్మక పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు అయ్యారని అన్నారు. ప్రజలు నిత్యం సంతోషంతో ఉండాలనే వైఎస్సార్ ఆశయాలే సాధనగా తమ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో... తాను సీఎం పదవి ఆశించిన మాట వాస్తవమేనన్న చెప్పిన భట్టి విక్రమార్క... పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని.. ప్రతి పార్టీలో ఉండే చిన్న చిన్న విభేదాలు ఉంటే అవి త్వరలో సద్దుమణుగుతాయని తెలిపారు.