భీమిలీ మోడల్ అంటున్న గంటా
ఆ వెంటనే మంత్రి కావడంతో ఆయన అయిదేళ్ళూ బిజీగా గడిపేశారని విమర్శలు ఉన్నాయి.
By: Tupaki Desk | 12 Dec 2024 3:42 AM GMTమాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గం భీమునిపట్నాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. అన్ని విధాలుగా నంబర్ వన్ చేస్తామని చెబుతున్నారు. ఆయన భీమిలీకి ఎమ్మెల్యే కావడం ఇది రెండోసారి. 2014లో భీమిలీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ వెంటనే మంత్రి కావడంతో ఆయన అయిదేళ్ళూ బిజీగా గడిపేశారని విమర్శలు ఉన్నాయి.
ఇపుడు 2024లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. సెంటిమెంట్ ప్రకారం భీమిలీ ఎమ్మెల్యే అయిన వారు మంత్రి కావాలి. కానీ ఈసారి ఆ లక్ అయనకు చిక్కలేదు. దాంతో మాజీ మంత్రిగా తాజా ఎమ్మెల్యేగా మిగిలిపోయారు.
ఇది ఒకందుకు తమకు మంచిదని నియోజకవర్గం ప్రజలు నాయకులు అంటున్నారు. గంటా ఇపుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దాంతో పాటుగా అభివృద్ధి చేసి చూపిస్తామని అంటున్నారు. ఇపుడు మోడల్ గా భీమిలీ అని కొత్త స్లోగన్ ఇస్తున్నారు.
దాంతో మంత్రి అయితే అయిదేళ్ళూ చేసినదేమో కానీ ఎమ్మెల్యేగా పట్టుదలగా పనిచేస్తే భీమిలీ ఆయన చెప్పినట్లుగానే మోడల్ నియోజకవర్గం గా మారుతుందని అంటున్నారు. గంటాకు ఇపుడు తన నియోజకవర్గంలో అభివృద్ధి చూపించాల్సిన అవసరం కూడా ఉంది. భీమిలీని సొంత నియోజకవర్గంగా చేసుకుందామని ఇక మీదట తాను గానీ తన వారసుడు కానీ పోటీ చేసేలా ఉండాలంటే పలుకుబడి బాగా ఉండాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఏ విధంగా అనుకున్నా గంటా భీమిలీ మీద మనసు పడితే పట్టు బడితే బాగుపడేది తమ ప్రాంతమే కదా అని జనాలు అనుకుంటున్నారు.