పవన్ తో గ్రంధి : కిక్కెక్కిస్తున్న భీమవరం రాజకీయం ...!
ఆనాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేశారు. కానీ ఓటమి పాలు అయ్యారు. ఆయన మీద వైసీపీ నేత గ్రంధి శ్రీనివాస్ గెలిచారు. ఈసారి కూడా జగన్ ఆయనకే టికెట్ ఇస్తున్నారు.
By: Tupaki Desk | 18 Feb 2024 3:41 AM GMTభీమవరం రాజకీయం ఈసారి ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తిని పెంచుతున్న అంశం. భీమవరం 2019లో వైసీపీకి జై కొట్టింది. ఆనాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేశారు. కానీ ఓటమి పాలు అయ్యారు. ఆయన మీద వైసీపీ నేత గ్రంధి శ్రీనివాస్ గెలిచారు. ఈసారి కూడా జగన్ ఆయనకే టికెట్ ఇస్తున్నారు.
అయిదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉన్న గ్రంధికి స్థానికంగా పట్టు ఉంది. పైగా లోకల్ కార్డు ఉంది. అందరితో కలుపుగోలుగా ఉంటారని పేరుంది. కరోనా వంటి విపత్కర పరిస్థితులలో జనంలో ఉంటూ వారికి సేవ చేశారు మా ఎమ్మెల్యే అని అనుచరులు చెబుతున్నారు. ఇక జగన్ పధకాలు ఎటూ ఉండనే ఉన్నాయి.
భీమవరంలో మా ఎమ్మెల్యే రియల్ హీరో అని ఆ మధ్య భీమవరంలో జరిగిన సభలో సీఎం జగన్ ప్రకటించారు. బహుశా పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తారు అని దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే జనసేన టీడీపీ పొత్తు ఉంది. అంకెలు అన్నీ ఆ కూటమికే అనుకూలంగా ఉన్నాయి.
అయితే రాజకీయం ఎపుడూ ఒకలా ఉండదు. రెండు వేరుగా ఉంటే వచ్చే నంబర్ వేరు, కలసి ఉంటే అదే నంబర్ వస్తుందా ఇంకా ఎక్కువ వస్తుందా లేక తక్కువ వస్తుందా ఇదే చర్చగా ఉంది. వైసీపీ అయితే రెండూ కలిస్తే తక్కువ నంబరే వస్తుంది కాబట్టి అది తమకు అనుకూలం అని చెబుతోంది. మా పధకాలు మా ఎమ్మెల్యే పనితీరు భీమవరంలో మరోసారి వైసీపీని గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు గ్రంధి శ్రీనివాస్ లోకల్ ఎమ్మెల్యే. దానికి తోడు టికెట్ ముందే ఖరారు కావడంతో ఆయన ప్రచార పర్వంలోకి దిగిపోయారు. ఆయన సొంత నియోజకవర్గం కావడంతో జనంతో కూడా వ్యక్తిగత సంబంధాలు బాగా ఉన్నాయని అంటున్నారు. పవన్ పోటీ చేస్తారు అని కన్ ఫర్మ్ కాలేదు కానీ జనసేన నేతలు మాత్రం పవన్ కి ఓటేయాలని ఇంటింటికీ తిరిగి ప్రచారం చెస్తున్నారు.
ఇలా రెండు పార్టీలు జనంలోనే ఉంటున్నాయి. ఇక ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2019లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ కి 70 వేల 642 ఓట్లు వచ్చాయి. జనసేన నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి 62 వేల 285 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 54 వేల 37 ఓట్లు వచ్చాయి. లెక్క చూస్తే జనసేన టీడీపీకి ఏకంగా లక్షకు పై చిలుకు ఓట్లు దక్కబోతాయని తేలుతోంది. అంటే దాదాపుగా నలభై నాలుగు వేల పై చిలుకు ఓట్ల తేడాతో పవన్ ఇక్కడ గెలుస్తారు అని పాత లెక్కలు చెబుతున్నాయి.
ఇపుడు చూస్తే జనసేన బలం పెరిగిందని, టీడీపీ ఓట్ల శాతం పెరిగిందని రెండు పార్టీలు కలిస్తే లక్షన్నర ఓట్లు కచ్చితంగా వస్తాయని అంటున్నారు. ఇక వైసీపీ అయిదేళ్ల పాటు పాలించింది కాబట్టి యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుందని దాంతో డెబ్బై వేలు కాస్తా యాభై వేలకు దిగితే లక్ష ఓట్లతో జనసేన తరఫున పవన్ గెలుస్తారు అని ఆ పార్టీ నేతలు ధీమా పడుతున్నారు.
మరి ఈ లెక్కలు కరెక్టేనా జనాలు అలాగే ఓటేస్తారా లేక పాత లెక్కలు మార్చి కొత్త లెక్కలు కూడా తమదైన శైలిలో ఏర్చి కూర్చి సరికొత్త తీర్పు ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. భీమవరంలో గెలిచిన పార్టీదే ఏపీలో అధికారం అంటున్నారు. సో ఆ సెంటిమెంట్ కూడా ఎలా పనిచేస్తుందో ఈసారి చూడాల్సిందే.