Begin typing your search above and press return to search.

121 మంది చనిపోయిన తొక్కిసలాట ఘటన.. బాబాకు క్లీన్ చిట్!

హాథ్రాస్ తొక్కిసలాట కేసులో భోలే బాబాకు క్లీన్ చిట్ లభించింది. ఇదే సమయంలో... ఈ వ్యవహారంలో పోలీసులదే తప్పు అని కమిషన్ తేల్చింది!

By:  Tupaki Desk   |   21 Feb 2025 10:09 AM GMT
121 మంది చనిపోయిన తొక్కిసలాట ఘటన.. బాబాకు క్లీన్ చిట్!
X

ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూలై మొదటి వారంలో జరిగిన ఈ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో సుమారు 121 మంది ప్రాణాలు కోల్పోగా అనేకమంది గాయాలపాలయ్యారు! ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఈ కార్యక్రమంలో 'భోలే బాబా' కోసం జరుగుతుంటుంది! హాథ్రాస్ జిల్లాలో ఆయన ప్రతీ మంగళవారం నిర్వహించే సత్సంగ్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఈ క్రమంలో జరిగిన ఘటనపై న్యాయ కమిషన్ ను ఏర్పాటు చేయగా.. తాజాగా సదరు కమిషన్ ఈ ఘటనలో 'భోలే బాబా'కు క్లీన్ చిట్ ఇచ్చింది.

అవును... హాథ్రాస్ తొక్కిసలాట కేసులో భోలే బాబాకు క్లీన్ చిట్ లభించింది. ఇదే సమయంలో... ఈ వ్యవహారంలో పోలీసులదే తప్పు అని కమిషన్ తేల్చింది! వారి నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని.. ఈ కార్యక్రమంలో భద్రతా ప్రమాణాలు పాటించలేదని.. ఇందులో స్పష్టమైన నిర్వహణ లోపం ఉందని న్యాయ కమిషన్ పేర్కొంది!

ఇదే సమయంలో... పోలీసులు తమ బాధ్యతలను సీరియస్ గా తీసుకోలేదని.. జనసమూహాన్ని సరిగ్గా నియంత్రించి ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదని న్యాయ కమిషన్ అభిప్రాయపడిందని అంటున్నారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి పోలీసులే కార్యక్రమానికి ముందు తనిఖీలు చేయాలని.. అన్ని నియమాలను పాటిస్తున్నారా లేదా అనేది నిర్ధారించుకోవాలని తెలిపింది!

కాగా... ఉత్తరప్రదేశ్ కు చెందిన నారాయణ్ సాకార్ హరి.. భోలే బాబాగా ప్రసిద్ది. పటియాలి తహసీల్ లోని బహదూర్ గ్రామానికి చెందిన ఆయన.. బాల్యంతో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడని చెబుతారు. గతంలో తాను ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసినట్లు నారాయణ్ సాకార్ చెప్పుకుంటుంటారు! సుమారు పాతికేళ్ల క్రితం ఉద్యోగం నుంచి వైదొలగి ఆధ్యాత్మిక బాట పట్టినట్లు చెబుతుంటారు.

ఈ క్రమంలోనే.. హాథ్రస్ జిల్లాలో ప్రతీ మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు హాజరువుతుంటారు. ఈ నేపథ్యలోనే బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. దీంతో.. ఊపిరాడక అనేకమంది అపస్మారక స్థితిలోకి వెళ్లి, ప్రాణాలు కోల్పోయారు!

మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు అప్పట్లో కథనాలొచ్చాయి. అయితే.. ఈ ఘటనలో భోలే బాబాకు క్లీన్ చిట్ ఇస్తూ న్యాయ కమిషన్ నివేదిక సమర్పించినట్లు తెలిస్తోంది. ఈ సందర్భంగా పోలీసులను తప్పుబట్టినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కమిషన్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక... ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి బ్రజేష్ కుమార్ శ్రీవాస్తవ అధ్యక్షతన న్యాయ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇందులో.. రిటైర్డ్ ఐపీఎస్ భవేష్ కుమార్ సింగ్, రిటైర్డ్ ఐఏఎస్ హేమంత్ రావులను సభ్యులుగా నియమించారు.