బోలే బాబా..ఇప్పుడు బోసి బాబా.. 100 కోట్ల ఆస్తులు సీజ్
మరోవైపు దుర్ఘటనను తీవ్రంగా తీసుకున్న యూపీ సర్కారు.. దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో భోలే బాబా కూడబెట్టినదెంతో బయటపడింది
By: Tupaki Desk | 6 July 2024 11:33 AM GMTమొన్నటిదాకా అతడి పాద మోపిన మట్టి భక్తులకు బంగారం.. అతడి చేతితో ఇచ్చిన నీళ్లు గొప్ప ఔషధం.. లక్షల మందికి అతడో దైవం.. వందల మంది అనుచరులు.. వేలమంది భక్తులు.. విలాస భవనాలు, ఆశ్రమాలు.. ఎకరాల కొద్దీ భూములు.. భోలే బాబా అంటే యూపీ నుంచి మూడు నాలుగు రాష్ట్రాల్లో అబ్బో గొప్ప పేరు. అత్యంత సాధారణ వ్యక్తి అయిన అతడు బాబా అవతారం ఎత్తి వంద కోట్లు కూడబెట్టాడు. అలాంటి బోలే బాబా ఇప్పుడు బోసి బాబాగా మిగిలిపోయాడు. ఉత్తరప్రదేశ్ హథ్రాస్ జిల్లాలో గత మంగళవారం సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్ అలియాస్ భోలే బాబా ఆశ్రమంలో జరిగిన తొక్కిసలాటలో 120 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో బాబా పరారయ్యాడు. శనివారం మీడియాకు ప్రకటన ఇచ్చాడు. మరోవైపు దుర్ఘటనను తీవ్రంగా తీసుకున్న యూపీ సర్కారు.. దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో భోలే బాబా కూడబెట్టినదెంతో బయటపడింది.
20 ఏళ్లలో 100 కోట్లు
భోలే బాబా ఇరవై ఏళ్ల కిందట సాధారణ వ్యక్తి. బాబాగా మారాక 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టాడు. తెల్లటి సూటు, బూట్లు, టై, నల్లద్దాలతో కనిపించే భోలే బాబాది విలాస జీవనం. అయితే, అతడికి కాస్‌గంజ్, ఆగ్రా, కాన్పూర్, గ్వాలియర్ సహా దేశవ్యాప్తంగా మొత్తం 24 ఆశ్రమాలున్నాయి. శ్రీ నారాయణ్ హరి సాకార్ ట్రస్ట్ పేరిట వీటిని నిర్వహిస్తున్నాడు. మెయిన్ పురి హరి నగర్ ఆశ్రమమే 13 ఎకరాల్లో ఉంటుంది. రాజ భవనాన్ని పోలి ఉన్న ఈ ఆశ్రమాన్ని రూ.4 కోట్లతో నిర్మించారు. బాబా, అతడి భార్య కోసం ఆరు విలాసవంతమైన గదులున్నాయి. ఇక 16 మంది వ్యక్తిగత కమాండోలు ఉంటారు. తెల్లటి టయోటా ఫార్చ్యూనర్ ముందు ఈ కమాండోలు బైక్ లపై వస్తుంటారు. భోలే బాబాకు 30 లగ్జరీ కార్ల కాన్వాయ్ ఉండడం గమనార్హం.
100 కోట్ల ఆస్తులు సీజ్
నేరగాళ్లు, మాఫియాపై బుల్డోజర్లను పంపే యూపీలోని యోగి సర్కారు ఇప్పుడు భోలే బాబాకు సంబంధించిన రూ.100 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. పైన చెప్పుకొన్నట్లే 24 విలాసవంతమైన ఆశ్రమాలూ వీటిలో ఉన్నాయి. తాను విరాళాలే తీసుకోనని చెప్పే బాబా ప్రైవేటు సెక్యూరిటీని మెయింటైన్ చేస్తుండడం గమనార్హం. దీంతోనే అతడిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. చివరకు భక్తులు ఎగబడి తొక్కిసలాట జరిగి వందకు పైగా ప్రాణాలు మట్టిలో కలిశాయి.