ఆ దారుణ ఘటన.. భోలే బాబా ఏం చెప్పారంటే!
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జూలై 2న భోలే బాబా కాలి మట్టిని తీసుకోవడానికి వెళ్లిన 121 మంది భక్తులు తొక్కిసలాటలో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 July 2024 9:00 AM GMTఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జూలై 2న భోలే బాబా కాలి మట్టిని తీసుకోవడానికి వెళ్లిన 121 మంది భక్తులు తొక్కిసలాటలో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇప్పటికే ఈ ఘటనకు కారకులైన ఆరుగురిని అరెస్టు చేసింది. ఇక ఘటన జరిగిన రోజు ముఖ్యసేవాదర్ గా ఉన్న దేవ్‌ప్రకాశ్ మధుకర్ తాజాగా పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు అతడినే ప్రధాన నిందితుడిగా పేర్కొనడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఈ దారుణ ఘటన జరిగాక తొలిసారి భోలే బాబా మీడియా ముందుకు వచ్చారు. తొక్కిసలాట ఘటనతో భోలే బాబా పేరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే పోలీసులు ఆయన పేరును ఎఫ్‌ఐఆర్ లో నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన భోలే బాబా అమాయకులు తొక్కిసలాటలో మృతి చెందడంపై స్పందించారు.
హత్రాస్ లో తొక్కిసలాటలో 121 మంది అమాయకులు బలికావడం పట్ల భోలే బాబా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జూలై 2న జరిగిన ఘటనతో తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నానన్నారు.
తొక్కిసలాటలో మరణించిన, గాయపడిన కుటుంబాలకు అండగా ఉండాలని కమిటీ సభ్యులను ఆదేశించానని భోలే బాబా వెల్లడించారు. తొక్కిసలాటకు బాధ్యులైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని తెలిపారు. తనకు ప్రభుత్వంపైన నమ్మకం ఉందన్నారు.
కాగా భోలే బాబాకు దేశవ్యాప్తంగా మొత్తం 21 ఆశ్రమాలు ఉన్నాయి. వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని సమాచారం. గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా భోలే బాబా పనిచేశారు.
భోలే బాబా అసలు పేరు.. సూరజ్ పాల్. గతంలో లైంగిక వేధింపుల కేసులో కొన్నాళ్లు ఆయన జైలులో కూడా గడిపారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆధ్యాత్మికత వైపు మళ్లారు. తన బోధనలతో భక్తులను ఆకర్షించారు.
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ తోపాటు హత్రాస్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో భోలే బాబా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సత్సంగ్ లకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
ఈ నేపథ్యంలో జూలై 2న హత్రాస్ లో భోలే బాబా నిర్వహించిన సత్సంగ్ కు రెండున్నర లక్షలమంది వచ్చారని అంచనా. అయితే నిర్వాహకులు 80 వేల మందికి సరిపడా మాత్రమే ఏర్పాట్లు చేశారు. దీంతో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించారు.