అతి.. ఎందుకు అఖిలమ్మా?!
తాజాగా ఆమె గతంలో విజయం దక్కించుకున్న ఆళ్లగడ్డ నియోజకవర్గం, దోర్నిపాడు మండలం భాగ్యనగరం గ్రామంలో 'భవిష్యత్తుకు గ్యారంటీ' కార్యక్రమంలో పాల్గొనేందుకు బయల్దేరారు.
By: Tupaki Desk | 28 Dec 2023 5:54 AM GMTఒక వైపు టీడీపీలో టికెట్ వస్తుందో రాదో అనే బెంగ. మరోవైపు పూర్తిగా దూరమైన కేడర్.. వెరసి.. మాజీ మంత్రి, కర్నూలు కు చెందిన భూమా నాగిరెడ్డి వారసురాలు.. భూమా అఖిల ప్రియ అంతర్మథనం చెందుతున్నారు. దీంతో ఏదో ఒకరకంగా వార్తల్లో నిలవాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఘటన తర్వాత.. ఆమె 'అతి' చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నా యి. తాజాగా ఆమె గతంలో విజయం దక్కించుకున్న ఆళ్లగడ్డ నియోజకవర్గం, దోర్నిపాడు మండలం భాగ్యనగరం గ్రామంలో 'భవిష్యత్తుకు గ్యారంటీ' కార్యక్రమంలో పాల్గొనేందుకు బయల్దేరారు.
అయితే, అప్పటికే ఆగ్రామంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో జరుగుతోంది. ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇదే విషయాన్ని పోలీసులు కూడా అఖిల ప్రియకు చెప్పారురు. శాంతి భద్రతల సమస్య వస్తుందని, ఆ గ్రామానికి వెళ్లొద్దని పోలీసులు వివరించారు. చాలా సేపు బ్రతిమాలారు. అయితే.. పోలీసుల వినతిని పక్కన పెట్టిన భూమా.. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తాను భాగ్యనగరం వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఆమెను ముందస్తుగా అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు.
అరెస్టు చేసేముందు ఎందుకు నోటీసు ఇవ్వలేదని అఖిలప్రియ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాదాపు 20 నిమిషాల పాటు కారు డోర్‌లాక్ చేసుకుని, విండోస్ క్లోజ్ చేసి అందులోనే ఉండిపోయారు. అంతేకాదు.. ఫోన్లపై ఫోన్లు చేసి కార్యకర్తలను పిలిచి మరీ.. నిరసన చేయాలని కోరారు. దీంతో కార్యకర్తలు కొందరు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో ఎమ్మెల్యే బ్రిజేందర్‌రెడ్డి తన పర్యటనను పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. ఈ విషయం తెలియగానే పోలీసులు అఖిలప్రియను భాగ్యనగరం గ్రామానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. అయితే.. ఇంత మాత్రానికే అఖిల ప్రియ ఇంత 'అతి' చేయడం ఎందుకనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వెల్లడవడం గమనార్హం.