Begin typing your search above and press return to search.

లోకేష్ ని కలిసిన అఖిల ప్రియ... తెరపైకి ఆళ్లగడ్డ టిక్కెట్ చర్చ!

ఏపీలో ఈసారి టీడీపీ - జనసేన పొత్తు కుదిరింది. దీంతో సీట్ల సర్ధుబాటు అంశం తెరపైకి వచ్చింది

By:  Tupaki Desk   |   19 Nov 2023 6:04 AM GMT
లోకేష్ ని కలిసిన అఖిల ప్రియ... తెరపైకి ఆళ్లగడ్డ టిక్కెట్ చర్చ!
X

ఏపీలో ఈసారి టీడీపీ - జనసేన పొత్తు కుదిరింది. దీంతో సీట్ల సర్ధుబాటు అంశం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా టీడీపీ కి చెందిన 25 - 30 మంది త్యాగాలు చేయకతప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భూమా అఖిల ప్రియ వ్యవహరం చర్చనీయాంశం అయ్యింది. ఈసారి అఖిల ప్రియకు టిక్కెట్ దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో లోకేష్ తో భేటీ అయ్యారు అఖిల ప్రియ!

అవును... నారా లోకేష్ పిలుపు మేర‌కు అఖిల‌ప్రియ హైద‌రాబాద్ వెళ్లారు. ఈ సంద‌ర్భంగా లోకేష్ ను క‌లిసిన ఫొటోను అఖిల‌ప్రియ అధికారిక ఫేస్‌ బుక్‌ లో షేర్ చేశారు. ఈ క్రమంలో ఆళ్లగ‌డ్డ టికెట్‌ అఖిల ప్రియకే అని సోషల్ మీడియాలో ఆమె అనుకూలవర్గం హల్ చల్ చేస్తున్నారు! దీంతో ఇప్పుడు స్థానికంగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి అభ్యర్థులను ప్రకటించే విషయంలో టీడీపీ ఏమాత్రం తొందరపడదని అంటుంటారు. పలు చోట్ల నామినేషన్స్ చివరి రోజు ఉదయం వరకూ కూడా సస్పెన్స్ కంటిన్యూ అవుతూ ఉంటుందని.. ఇంకా ఎవరైనా బెస్ట్ పెర్సన్ దొరుకుతారా అనే ఆలోచనల బాబు చేస్తుంటారని చెబుతుంటారు. పైగా జనసేనతో పొత్తు నేపథ్యంలో ఈసారి మరింత సస్పెన్స్ సాగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ సమయంలో అఖిల ప్రియ.. నారా లోకేష్ ని హైదరబాద్ వెళ్లి కలవడం.. అనంతరం సోషల్ మీడియాలో ఆళ్లగడ్డ సీటు ఆమెకే అనే ప్రచారం మొదలవడం ఆసక్తిగా మారింది. ఇంతకూ పార్టీ ఆళ్లగడ్డ అసెంబ్లీ టిక్కెటు ఆమెకే నిర్ణయిస్తుందా.. అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుంది అనేది వేచి చూడాలి!

కాగా.. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టైన సమయంలో భూమా అఖిల ప్రియ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాజమండ్రి జైలు గోడలు బద్దలు కొట్టాలనే స్థాయిలో ఆమె ఆవేశపడ్డారు! ఇదే సమయంలో... నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్‌ హాల్‌ దగ్గర ఆమె దీక్షకు దిగారు. ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి కూడా ఈ నిరవధిక దీక్షలో కూర్చున్నారు.

ఆ సమయంలో పోలీసులు ఆ దీక్షను భగ్నం చేసిన సమయంలో స్పందించిన ఆమె... పోలీసులు బలవంతంగా తనను, తన తమ్ముడ్ని తీసుకుని వచ్చి ఇంటిదగ్గర వదిలేశారని.. అయినప్పటికీ తాను మాత్రం ఆమరణ నిరాహార దీక్షను ఆపే ప్రసక్తి లేదని.. ఇంటి నుంచే ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు! దీంతో... ఆ సమయంలో లోకేష్ దృష్టిని ఆకర్షించారా అనే చర్చ కూడా నడిచింది.